Compensation for terror victims : సరిహద్దు కాల్పుల్లో, ఉగ్రవాద దాడుల్లో సర్వం కోల్పోయి, ఏళ్ల తరబడి పరిహారం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న బాధితులకు జమ్మూ కశ్మీర్ హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం, రెండు నెలల్లోగా బాధితులకు సహాయ ప్రక్రియను పూర్తి చేయాలని, పరిహారాన్ని చెల్లించాలని అల్టిమేటం జారీ చేసింది. అసలు ఈ కేసు నేపథ్యమేంటి..? ఇన్నాళ్లూ ఈ జాప్యం ఎందుకు జరిగింది..?
కేంద్ర ప్రభుత్వం, ఉగ్రవాద దాడులు, సరిహద్దు కాల్పుల బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు 2019లో ఒక ప్రత్యేక పథకాన్ని (‘Central Scheme for Assistance to Civilian Victims…’) తీసుకొచ్చింది. అయితే, ఈ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, అర్హులైన బాధితులకు పరిహారం అందడం లేదని ఆరోపిస్తూ, సరిహద్దు పట్టణమైన ఉరికి చెందిన ‘ఉరి ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ, 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసింది.
ఏళ్ల తరబడి నిరీక్షణ.. కోర్టు ఆగ్రహం : ఈ పిటిషన్‌పై నాలుగేళ్లుగా విచారణ జరుగుతున్నా, ప్రభుత్వం నుంచి సరైన స్పందన కొరవడింది. పరిహారం అందని వారి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు పలుమార్లు ఆదేశించినా, అధికారులు నిర్లక్ష్యం వహించారు. మంగళవారం జరిగిన తుది విచారణలో ప్రభుత్వ తీరుపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రభుత్వ వాదన.. కోర్టు ఆదేశాలు : ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ అదనపు అడ్వకేట్ జనరల్, పిటిషన్‌లో పేర్కొన్న 71 కేసుల్లో 61 మంది వివరాలను వైద్య బోర్డుకు పంపామని, వారి వికలాంగత్వ శాతాన్ని నిర్ధారించాక పరిహారం చెల్లిస్తామని తెలిపారు. మరో 10 మంది మరణించారని, వారి కేసులు కూడా పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.
ఇరువర్గాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అరుణ్ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం, ఈ కేసును ముగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
రెండు నెలల గడువు: ప్రభుత్వం రెండు నెలల్లోగా బాధితుల పరిహార ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
గడువు తప్పనిసరి: ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన హామీ మేరకు, ఈ గడువులోగా పరిహారం చెల్లించి, కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
ఏళ్ల తరబడి సాగుతున్న ఈ న్యాయపోరాటానికి హైకోర్టు తీర్పుతో ముగింపు పలికినట్లయింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నలిగిపోతున్న ఉగ్రవాద బాధితుల కుటుంబాలకు ఈ తీర్పు కొత్త ఆశను చిగురింపజేసింది.


