Sunday, November 16, 2025
Homeనేషనల్VP Polls: ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్!

VP Polls: ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్!

Vice-Presidential Election 2025 : దేశ రెండవ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో తెలంగాణ తేజం, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నిలిచారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గురువారం పార్లమెంటు భవన్‌లో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ వంటి హేమాహేమీలు సుదర్శన్ రెడ్డి వెంట ఉండి, ఆయన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

- Advertisement -

అభ్యర్థి ఎంపిక వెనుక వ్యూహం ఏమిటి : న్యాయపాలికలో అపార అనుభవం, నిష్కళంకమైన కీర్తి, సామాజిక న్యాయం పట్ల బలమైన నిబద్ధత కలిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం ద్వారా, ఈ ఎన్నికను కేవలం రాజకీయ పోరాటంగా కాకుండా, ఒక సైద్ధాంతిక సమరంగా మలచాలని ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే తమ ప్రధాన అజెండా అని చాటిచెప్పే ప్రయత్నం చేసింది.

సుదర్శన్ రెడ్డి ప్రస్థానం :  1946 జూలై 8న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, ఆకుల మైలారం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి జన్మించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొంది, 1971లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, తనదైన ముద్ర వేశారు.

2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తన నాలుగున్నరేళ్ల పదవీకాలంలో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. నల్లధనం కేసులో ప్రభుత్వ జాప్యాన్ని తీవ్రంగా విమర్శించి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఆదేశించడం, మావోయిస్టుల ఏరివేత పేరుతో గిరిజన యువతతో ఏర్పాటు చేసిన “సల్వాజుడుం”ను చట్టవిరుద్ధమని ప్రకటించడం వంటి సాహసోపేతమైన తీర్పులు ఆయన చిత్తశుద్ధికి, ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. పదవీ విరమణ అనంతరం గోవాకు తొలి లోకాయుక్తగా కూడా ఆయన సేవలందించారు.

ఎదురు నిలిచేది ఎవరు – సెప్టెంబర్ 9న పోలింగ్ : ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌తో తలపడనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అకాల రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఆగస్టు 21 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా, సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసి నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సంఖ్యాబలం ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నప్పటికీ, సైద్ధాంతిక పోరాటంలో నైతిక విజయం సాధించాలని ఇండియా కూటమి భావిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad