Justice Sanjay Karol farewell speech : న్యాయమూర్తులు కేవలం సెక్షన్లను యాంత్రికంగా అమలు చేసే అధికారులు కారాదని జస్టిస్ కరోల్ స్పష్టం చేశారు. పిటిషన్ కేవలం కేసు వాస్తవాలను మాత్రమే చెబుతుందని, అయితే బాధితుడు ఏం కోల్పోయాడో, ఎలాంటి వేదనతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడో అర్థం చేసుకోవడానికి న్యాయమూర్తికి వినయం, మానవీయ కోణం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు.
వాదనలే కాదు.. మౌనమూ ముఖ్యమే : దాదాపు 19 ఏళ్లు న్యాయమూర్తిగా సేవలు అందించిన ఆయన, కోర్టు గదిలో న్యాయవాదుల వాదనలతో పాటు బాధితుల మౌనంలో దాగి ఉన్న ఆవేదనను చదవగలగాలని సూచించారు. న్యాయపీఠం ఔన్నత్యం అధికార ప్రదర్శనలో కాకుండా, బాధ్యతాయుతమైన నిజాయితీలో ఉంటుందని వెల్లడించారు.
సామాన్యుడి నమ్మకమే వ్యవస్థకు బలం : సుప్రీంకోర్టు గొప్పతనం సంచలన కేసుల తీర్పుల్లో కాదని, న్యాయం లభిస్తుందన్న సామాన్య పౌరుడి అచంచల విశ్వాసంలోనే దాగి ఉందని వివరించారు. ఖరీదైన న్యాయం వల్ల కోర్టుల గడప తొక్కలేని అణగారిన వర్గాలకు ధైర్యాన్నివ్వడమే అసలైన ‘ధర్మం’ అని స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి కేవలం కోర్టు గదులకే పరిమితం కాకుండా, ప్రతి పౌరుడి నిత్య జీవిత ఆచరణలో ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు.

