CJI Justice Sanjiv Khanna| భారతదేశం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా తదితర ప్రముఖులు హాజరయ్యారు.
సీజేఐ(CJI)గా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది మే 13వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు.
కాగా 2019 జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఖన్నా.. ఎన్నో చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో కీలక పాత్ర పోషించారు. ఈవీఎంల వినియోగాన్ని సమర్థించడం, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయడం, ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం, మాజీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వంటి అనేక మైలురాయి తీర్పులలో భాగంగా ఉన్నారు.