Next Chief Justice of India : భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత పీఠానికి కొత్త సారథిని ఎంపిక చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన వారసుడిని సిఫార్సు చేయాలని కేంద్ర న్యాయశాఖ, సీజేఐకి అధికారికంగా లేఖ రాసింది. సంప్రదాయం ప్రకారం, సీనియారిటీలో తర్వాతి స్థానంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్, దేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. అసలు ఈ నియామక ప్రక్రియ ఎలా జరుగుతుంది? జస్టిస్ సూర్యకాంత్ నేపథ్యమేంటి?
సాధారణంగా, సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందు, తదుపరి సీజేఐ నియామక ప్రక్రియను కేంద్ర న్యాయశాఖ ప్రారంభిస్తుంది. ప్రస్తుత సీజేఐ, సుప్రీంకోర్టులో తన తర్వాత అత్యంత సీనియర్‌గా ఉన్న న్యాయమూర్తి పేరును తదుపరి సీజేఐగా సిఫార్సు చేస్తారు. ఈ సిఫార్సును ప్రధానమంత్రి ద్వారా రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదంతో, కొత్త సీజేఐ నియామకం ఖరారవుతుంది. ఈ సంప్రదాయం ప్రకారమే, కేంద్ర న్యాయశాఖ గురువారం సీజేఐ జస్టిస్ గవాయ్‌కు లేఖ రాసింది. ఆయన, సీనియారిటీలో తర్వాతి స్థానంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేయనున్నారు.
ఎవరీ జస్టిస్ సూర్యకాంత్ : హరియాణాలోని హిసార్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్, న్యాయవాద వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగారు. 2000 సంవత్సరంలో, అత్యంత పిన్నవయస్సులోనే హరియాణా అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 2004లో పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా కూడా ఆయన పనిచేస్తున్నారు. కొత్త సీజేఐగా నియమితులైతే, నవంబర్ 24న బాధ్యతలు స్వీకరించి, సుమారు 15 నెలల పాటు, అంటే 2027 ఫిబ్రవరి 29 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.
సీజేఐపై దాడి యత్నం : ఇదిలా ఉండగా, ఇటీవల ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్‌పై కోర్టు హాలులోనే ఓ న్యాయవాది బూటుతో దాడికి యత్నించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ప్రధాని మోదీతో పాటు, యావత్ దేశం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


