తమిళ సినీ పరిశ్రమలో బాల నటుడిగా ప్రవేశం నుంచి.. రాజకీయ అరంగేట్రం వరకూ కమల్ హాసన్ చేసిన ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఆయన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో కమల్ హాసన్ రాజకీయంగా మాత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తమిళనాడులో అధికార పార్టీ అయిన డిఎంకె మద్దతుతో ఆయన రాజ్యసభకు నామినేషన్ వేయడం, ఆయన ఆస్తుల వివరాలు అధికారికంగా బయటపడటంతో కమల్ పేరు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
కమల్ హాసన్ తన నామినేషన్ పత్రాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయన వద్ద మొత్తం రూ. 305.55 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. అందులో రూ.245.86 కోట్లు స్థిరాస్తులైతే, రూ.59.69 కోట్లు చరాస్తులుగా నమోదు చేశారు. ప్రముఖ నగరాల్లో కమర్షియల్ బిల్డింగ్లు నాలుగు ఉండగా, వాటి మొత్తం విలువ రూ.111.1 కోట్లు. అలాగే ఒక వ్యవసాయ భూమిని కూడా కమల్ కలిగి ఉండగా, దాని విలువ రూ.22.24 కోట్లుగా పేర్కొన్నారు.
2023–24 ఆర్థిక సంవత్సరానికి ఆయన ఆదాయం రూ.78.9 కోట్లుగా నమోదు కాగా, ఖరీదైన కార్ల కలెక్షన్ కూడా ఆయన సంపన్నతకు అద్దం పడుతోంది. బెంజ్, BMW, లెక్సస్, మహీంద్రా వంటి బ్రాండ్లకు చెందిన నాలుగు కార్ల విలువను రూ.8.43 కోట్లుగా లెక్కించారు. ఇక కమల్ హాసన్‌కి అప్పులు కూడా లేకపోలేదు. మొత్తం రూ.49.67 కోట్లు రూపాయల లోన్లు ఉన్నట్లు ఆయన నామినేషన్లో పేర్కొన్నారు. రాజకీయంగా కొత్త మలుపులు తిరుగుతున్న తరుణంలో కమల్ ఆస్తుల ఈ వివరాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రాజకీయాల్లో ప్రజల సేవే తన లక్ష్యమని చెప్పే కమల్.. తాజాగా డిఎంకె మద్దతుతో నేషనల్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో, ఆయన ఆర్థిక స్థితి చర్చకు దారితీసింది. దీనికి ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.