Kamal Haasan on Sanatan Dharma : లోకనాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిన కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం అధినేతగా మరోసారి తనదైన మాటల తూటాలతో కలకలం రేపారు. రాజకీయ ప్రవేశం తర్వాత తన మాటలకు మరింత పదును పెట్టిన ఆయన, ఈసారి ‘సనాతన ధర్మం’పై కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు. నియంతృత్వం, సనాతన సంకెళ్లను బద్దలు కొట్టగల ఏకైక ఆయుధం విద్య మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అసలు కమల్ ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారు…? ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమిటి…? రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం ఈ వ్యాఖ్యలకు ఎలా దోహదం చేసింది…?
‘అగరం’ వేదికగా.. అక్షరాయుధంపై పిలుపు : చెన్నైలో ‘అగరం ఫౌండేషన్’ శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్, విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.
“విద్యను మాత్రమే చేతిలోకి తీసుకోండి”: “మీరు మరే ఇతర ఆయుధాన్ని చేతిలోకి తీసుకోవద్దు. విద్యను మాత్రమే ఆయుధంగా చేసుకోండి. అది లేకుండా మనం గెలవలేం. ఎందుకంటే, మెజారిటీ వాదం మిమ్మల్ని ఓడించాలని చూస్తుంది. కానీ, జ్ఞానం మాత్రమే వారిని ఓడించగలదు. అందుకే మనం విద్యను గట్టిగా పట్టుకోవాలి,” అని కమల్ పిలుపునిచ్చారు.
సేవ ఓ ముళ్ల కిరీటం: సామాజిక సేవ, సినిమా రంగం రెండూ భిన్నమైనవని కమల్ అన్నారు. “సినిమాల్లో మన నటనకు మనమే పట్టాభిషేకం చేసుకుంటాం. కానీ సామాజిక సేవలో మనకు దొరికేది ముళ్ల కిరీటం. ఆ కిరీటాన్ని స్వీకరించడానికి దృఢమైన హృదయం కావాలి,” అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
‘నీట్’పై విమర్శలు.. సీఎంతో చర్చ : ఈ సందర్భంగా విద్యారంగంలోని సవాళ్లను కూడా కమల్ ప్రస్తావించారు. ముఖ్యంగా, తమిళనాడులో వివాదాస్పదంగా మారిన ‘నీట్’ పరీక్షపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
“2017లో నీట్ ప్రవేశపెట్టడం వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు అవకాశాలు కోల్పోయారు. అగరం ఫౌండేషన్ వంటి సంస్థలు ఎంత ప్రయత్నించినా, చట్టం అడ్డంకిగా మారడంతో ఒక స్థాయికి మించి సహాయం చేయలేకపోతున్నాయి,” అని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని మార్చాలంటే బలం కావాలని, ఆ బలం విద్యతోనే వస్తుందని అన్నారు. ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో మాట్లాడానని, స్వచ్ఛంద సంస్థలు (NGOs) డబ్బు అడగడం లేదని, పనిచేయడానికి అనుమతి మాత్రమే కోరుతున్నాయని వివరించినట్లు తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కమల్ వెల్లడించారు.
రాజకీయ ప్రయాణం.. రాజ్యసభ గమనం : 2018లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీని స్థాపించిన కమల్ హాసన్, 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో స్వయంగా ఆయనే ఓటమి పాలయ్యారు. అనంతరం, ఆయన ఇండియా కూటమిలో చేరారు.
గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించారు. ఆ ఒప్పందంలో భాగంగా, డీఎంకే ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించింది. ఇటీవలే ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఎంపీగా మారిన తర్వాత, సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


