Kangana Ranaut slams AR Rahman : “బాలీవుడ్‌లో నాకు అవకాశాలు తగ్గడానికి మతపరమైన కోణం కూడా ఉండి ఉండవచ్చు”.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య, హిందీ చిత్ర పరిశ్రమలో పెను తుఫాను రేపింది. ఈ వ్యాఖ్యలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “మీ అంత పక్షపాతం, ద్వేషం ఉన్న వ్యక్తిని నేను చూడలేదు” అంటూ రెహమాన్‌పై నిప్పులు చెరిగారు.
రెహమాన్ ఏమన్నారు : ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఏఆర్ రెహమాన్, బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గాయని, దీని వెనుక ‘మతపరమైన కోణం’ కూడా ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. “నా వెనుక గుసగుసలు వినిపిస్తుంటాయి. నిర్ణయాధికారం ఇప్పుడు సృజనాత్మకత లేని వారి చేతిలో ఉంది,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కంగనా ఫైర్ : రెహమాన్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు.
“ప్రియమైన రెహమాన్ గారూ, బీజేపీకి మద్దతిస్తున్నందుకు ఈ పరిశ్రమలో నేను ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నాను. కానీ, మీలో ఉన్నంత ద్వేషం, పక్షపాతం నేను ఎవరిలోనూ చూడలేదు. నా ‘ఎమర్జెన్సీ’ సినిమా కథ వినడానికి కూడా మీరు నిరాకరించారు. నేను ప్రాపగండా సినిమాలు తీస్తానని నన్ను అవమానించారు. విమర్శకులు సైతం ‘మాస్టర్‌పీస్’ అని మెచ్చిన నా సినిమాను, మీరు మాత్రం ద్వేషంతో చూడలేకపోతున్నారు. మీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది,” అని కంగనా రాసుకొచ్చారు.
బాలీవుడ్ ప్రముఖుల కౌంటర్లు : ఈ వివాదంపై ఇతర బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు.
శోభా డే: “బాలీవుడ్ అత్యంత లౌకికవాద ప్రదేశం. ఇక్కడ ప్రతిభకే పట్టం. రెహమాన్ లాంటి పరిణతి చెందిన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదు,” అని ఆమె అన్నారు.
గాయకుడు షాన్: “మత వివక్షే ఉంటే, గత 30 ఏళ్లుగా ఖాన్ త్రయం (షారుఖ్, సల్మాన్, ఆమిర్) సూపర్ స్టార్లుగా ఎలా వెలుగొందుతున్నారు? వాళ్లు మైనారిటీలే కదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
జావేద్ అక్తర్: “రెహమాన్ చాలా పెద్ద మనిషి. చిన్న నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లడానికి భయపడుతుంటారు. అంతేగానీ, ఇందులో మతపరమైన అంశం ఉందని నేను అనుకోవడం లేదు,” అని ఆయన మరో కోణాన్ని వినిపించారు. రెహమాన్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం, బాలీవుడ్‌లో అంతర్గతంగా ఉన్న భిన్నాభిప్రాయాలను, రాజకీయ ప్రభావాలను మరోసారి బహిర్గతం చేసింది.

