Sanjay Kapur property dispute : రూ. 30 వేల కోట్ల అపార సంపద.. ప్రముఖ వ్యాపారవేత్త ఆకస్మిక మరణం.. ఆస్తి కోసం కోర్టుకెక్కిన పిల్లలు.. ఎదురుదాడికి దిగిన ప్రస్తుత భార్య.. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, దివంగత వ్యాపారవేత్త సంజయ్ కపూర్ కుటుంబంలో చెలరేగిన ఆస్తి వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తండ్రి ఆస్తిలో వాటా కావాలంటూ కరిష్మా పిల్లలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ”ఆయన మిమ్మల్ని ఎప్పుడో వదిలేశారు, నేనే ఆయన చట్టబద్ధమైన భార్యను” అంటూ సంజయ్ ప్రస్తుత భార్య ప్రియ సచ్‌దేవ్ కోర్టులో చేసిన ఘాటు వ్యాఖ్యలతో వివాదం తారాస్థాయికి చేరింది. అసలు వీలునామా ఏది..? పిల్లల ఆరోపణల్లో నిజమెంత? చట్టబద్ధమైన భార్యగా ప్రస్తుత భార్య వాదనలో పస ఎంత కోర్టులో వాడివేడి వాదనలు
ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ రూ. 30 వేల కోట్ల ఆస్తిలో వాటా ఇప్పించాలంటూ ఆయన పిల్లలు సమైరా, కియాన్ (కరిష్మా కపూర్ సంతానం) మార్చి 21న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖllklలు చేశారు. దీనిపై బుధవారం జరిగిన విచారణ వాడివేడిగా సాగింది. ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తూ సంజయ్ కపూర్ భార్య ప్రియ తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ నాయర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
“” ఈ పిటిషన్ అసలు విచారణార్హమైనదే కాదు. నేనే సంజయ్ కపూర్‌కు చట్టబద్ధమైన భార్యను. సుప్రీంకోర్టు వరకు పోరాడి విడాకులు తీసుకున్నప్పుడు లేని ప్రేమ, అప్యాయతలు ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి? నా భర్త చనిపోయారు, నేను ఇప్పుడు వితంతువును. నాపై కాస్తయినా సానుభూతి చూపండి. మీ భర్త మిమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టారు. చట్టబద్ధంగా ఆయనను వివాహం చేసుకున్న చివరి భార్యను నేను,” అంటూ ప్రియ తరఫు న్యాయవాది కరిష్మాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కోర్టు హాలులో కలకలం రేపాయి.
అసలు వివాదం ఇదే : కరిష్మా పిల్లలు తమ పిటిషన్‌లో సవతి తల్లి ప్రియ సచ్‌దేవ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
వీలునామా మాయం: తమ తండ్రి సంజయ్ కపూర్ రాసిన అసలు వీలునామాను ప్రియ దాచిపెట్టి, ఇటీవల జరిగిన కుటుంబ సమావేశంలో ఒక నకిలీ వీలునామాను చూపించారని ఆరోపించారు.
సమాచార నిరాకరణ: తండ్రి మరణానంతరం ఆయన ఆస్తుల వివరాలు చెప్పమన్నా, సంబంధిత పత్రాలు చూపించమన్నా ప్రియ నిరాకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు.
న్యాయబద్ధమైన వాటా: తండ్రి మరణించే నాటికి ఆయనకున్న పూర్తి ఆస్తుల వివరాలను కోర్టు ద్వారా తెలియజేయాలని, చట్టపరంగా తమకు రావాల్సిన వాటాను ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మలుపులు తిరుగుతున్న కేసు :ఈ ఆస్తి వివాదం కేవలం వీలునామాకే పరిమితం కాలేదు. దీని వెనుక మరిన్ని అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సంజయ్ సోదరి ఆరోపణలు: ప్రియ సచ్‌దేవ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు తమ తల్లి (కరిష్మా) చేత బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని సంజయ్ సోదరి మందిర కపూర్ మీడియా ముందు ఆరోపించడం కేసును మరింత జఠిలం చేసింది.
మరణంపై అనుమానాలు: ఈ ఏడాది జూన్‌లో లండన్‌లో పోలో ఆడుతూ సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించారు. అయితే, అది సహజ మరణం కాదని, హత్య జరిగిందని ఆరోపిస్తూ ఆయన తల్లి రాణీ కపూర్ బ్రిటన్ అధికారులకు లేఖ రాశారు. తన కుమారుడి మరణం వెనుక ఉన్న ఆర్థిక కుట్రను ఛేదించాలని ఆమె కోరారు.
2003లో వివాహం చేసుకున్న కరిష్మా, సంజయ్ కపూర్‌లు తీవ్ర విభేదాల నడుమ 2016లో విడాకులు తీసుకున్నారు. అనంతరం సంజయ్, ప్రియను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు సంజయ్ మరణంతో వేల కోట్ల ఆస్తిపై నెలకొన్న ఈ వివాదం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది


