కర్ణాటక(Karnataka)లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస బ్యాంకు దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం బీదర్‌లో పట్టపగలు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.93లక్షలు దోచుకున్న ఘటన మరువకముందే మరో భారీ దోపిడీ జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు(Mangalore) కొటేకర్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో(Bank Robbery) దోపిడీ ముఠా రెచ్చిపోయింది. బ్యాంకులోకి చొరబడిన దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించి రూ.15 కోట్ల విలువైన బంగారం, రూ. 5 లక్షల నగదు దోచుకెళ్లారు. ఫియట్ కారులో వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వరుస దొంగతనాలతో సామాన్యులతో పాటు అధికారులను తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటే బీదర్‌లో దోపిడీకి పాల్పడిన ముఠా.. రాయ్‌పుర్ మీదుగా పారిపోవాలని ప్రయత్నించారు. హైదరాబాద్‌కు వచ్చిన దొంగలు అఫ్జల్‌గంజ్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో రాయ్‌పుర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ట్రావెల్స్ సిబ్బంది బ్యాగులు తనిఖీ చేయడంతో నిందితులు ఒకరిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కాల్పులు జరిపిన ముఠా బిహార్ పారిపోయిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, శాంతిభద్రతల విభాగం పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.