Karnataka Cabinet Decides To Regulate RSS Activities: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలను నియంత్రించేందుకు కొత్త నిబంధనలను తీసుకురావాలని నిర్ణయించింది. రోడ్లపై మార్చ్‌లు, ప్రభుత్వ ప్రాంగణాలు, బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించకుండా నియంత్రించడం ఈ నిబంధనల లక్ష్యం.
ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరిన కొద్ది రోజులకే ఈ క్యాబినెట్ నిర్ణయం వెలువడింది.
ALSO READ: NAXAL SURRENDER: మావోయిస్టుల వెన్నులో వణుకు.. రెండ్రోజుల్లో 258 మంది లొంగుబాటు!
ప్రభుత్వ స్థలాల్లో అనుమతి తప్పనిసరి
క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ, “మేము ఏ సంస్థను నియంత్రించలేము, కానీ ఇకపై మీరు బహిరంగ ప్రదేశాల్లో లేదా రోడ్లపై ఇష్టానుసారం చేయలేరు. మీరు ఏది చేయాలనుకున్నా, తప్పనిసరిగా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి” అని స్పష్టం చేశారు. అనుమతి ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
“కేవలం అధికారులకు సమాచారం ఇచ్చి కర్రలు తిప్పుతూ రోడ్లపై నడవడానికి (పథ సంచాలన్) వీలు లేదు. మేము తీసుకురాబోయే కొత్త నిబంధనల్లో ఇవన్నీ భాగమవుతాయి” అని ఖర్గే చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సహాయం పొందే సంస్థలతో సహా అన్ని ప్రభుత్వ ప్రాంగణాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని అన్నారు.
ALSO READ: CASTE SURVEY: కులగణన సర్వేకు నారాయణమూర్తి దంపతుల ‘నో’! “మేం వెనుకబడిన వారం కాదు”
పాత సర్క్యులర్‌తో బీజేపీకి కౌంటర్
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించే ప్రణాళికపై బీజేపీ నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి, ప్రభుత్వం 2013లో అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. పాఠశాల ప్రాంగణాలు, ఆట స్థలాలను కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి అని ఆ సర్క్యులర్ పేర్కొంది.
మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ, “ప్రభుత్వ, సంస్థాగత ఆస్తుల సక్రమ వినియోగాన్ని నిర్ధారించడానికి, అనుమతి లేకుండా కార్యకలాపాలు నిర్వహించకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని తెలిపారు. ఆర్ఎస్ఎస్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే ప్రశ్నకు, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారందరికీ ఇది వర్తిస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు. హోం, న్యాయ, విద్యా శాఖల పాత ఆదేశాలను క్రోడీకరించి, రెండు మూడు రోజుల్లో కొత్త నియమాన్ని రూపొందిస్తామని ఖర్గే తెలిపారు.


