Karnataka CM change speculation : కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి మార్పుపై నెలకొన్న “రెండున్నరేళ్ల” రగడ మళ్లీ రాజుకుంది. తదుపరి సీఎం డీకే శివకుమారేనంటూ కొందరు ఎమ్మెల్యేలు, నేతలు వ్యాఖ్యలు చేయడంతో, కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. “ఆ నిర్ణయం మా పార్టీ తీసుకుంటుంది, ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు ఈ సీఎం కుర్చీ వివాదం మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది? దీనిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఎలా స్పందించారు?
అసలేం జరిగిందంటే : 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పుడు, ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అప్పట్లో, అధిష్ఠానం ఇద్దరినీ బుజ్జగించి, తొలి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, తర్వాతి రెండున్నరేళ్లు శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఒప్పందం కుదిర్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ “రెండున్నరేళ్ల” గడువు సమీపిస్తుండటంతో, డీకే వర్గం మళ్లీ సీఎం మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చింది.
అధిష్ఠానం ఆగ్రహం.. నేతలకు హెచ్చరిక : ఈ బహిరంగ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
“మా పార్టీ ఏం చేయాలో నిర్ణయించే పూర్తి సామర్థ్యం మా అధిష్ఠానానికి ఉంది. ఆ నిర్ణయాన్ని మా పార్టీకే వదిలేయండి. ఈ విషయంపై ఇతరులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు అనుకూలంగా మా హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుంది.”
– కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
అంతేకాకుండా, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్పందిస్తూ, “నాయకత్వ మార్పుపై పదేపదే వదంతులు సృష్టించడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తుంది. వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీ నిబంధనలను ఉల్లంఘించకూడదు,” అని సొంత పార్టీ నేతలకు గట్టిగా హెచ్చరించారు.
“నేనే సీఎంగా ఉంటా”: సిద్ధరామయ్య : ఈ ఊహాగానాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పష్టతనిచ్చారు. “వచ్చే రెండున్నరేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. నాయకత్వ మార్పు చేర్పులతో పాటుగా.. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుంది,” అని ఆయన మైసూరులో తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. “హైకమాండ్‌లో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, అనవసర సమస్యలు సృష్టించవద్దు,” అని ఆయన నేతలకు హితవు పలికారు. అధిష్ఠానం, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇంత స్పష్టంగా చెబుతున్నా, కొందరు నేతలు పదేపదే సీఎం మార్పు అంశాన్ని లేవనెత్తడం కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలకు అద్దం పడుతోంది.


