కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు. బెలగావిలో నిర్వహించిన ‘సేవ్ కానిస్టిట్యూషన్’ కార్యక్రమంలో భద్రతా వైఫల్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో సీఎం ప్రసంగిస్తున్న సమయంలో కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు నల్ల కండువాలతో అక్కడికి చేరుకుని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభా ప్రాంగణంలో భద్రతా లోపం జరిగిందని భావించిన సిద్ధరామయ్య అసహనానికి గురయ్యారు.
వెంటనే వేదిక భద్రతను పర్యవేక్షిస్తున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని వేదిక పైకి పిలిచి మందలించడమే కాకుండా ఆయనపై చేయి ఎత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ముఖ్యమంత్రి తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మీ దుష్ప్రవర్తనను సరిదిద్దుకోండి అని హితవు పలికాయి.