Man living on leaves in India : ఆదిమానవుల గురించి పుస్తకాల్లో చదివాం. కానీ, ఈ ఆధునిక యుగంలో, స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో, ఓ వ్యక్తి అచ్చం ఆదిమానవుడిలా జీవిస్తున్నాడంటే నమ్ముతారా..? కర్ణాటకకు చెందిన ఓ 34 ఏళ్ల యువకుడు, గత పదేళ్లుగా దట్టమైన అడవిలోని ఓ కొండపై ఒంటరిగా జీవిస్తున్నాడు. కోతులు, మేకలు తినే ఆకులే అతని ఆహారం. అక్కడి సెలయేటి నీరే అతని దాహార్తి. రోజూ యోగా చేస్తూ సిక్స్ ప్యాక్ సాధించాడు. అసలు ఎవరీ బుడాన్ మాలిక్..? సమాజానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా బతకాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు..?
కర్ణాటకలోని బెళగావి జిల్లా, ఉగర్గోల్ గ్రామస్థుడైన బుడాన్ మాలిక్ హోసమణి, పదేళ్ల క్రితం (24 ఏళ్ల వయసులో) తన ఇంటిని, ఊరిని వదిలి, సుమారు 100 కి.మీ. దూరంలోని హెగ్గోల్ కొండపైకి చేరాడు.
ఒంటరితనం స్నేహంగా: చిన్నప్పటి నుంచి ఒంటరిగా తిరిగే బుడాన్‌కు, అదే ప్రశాంతతను ఇచ్చింది. గరుడ, శివ పురాణాలు చదివి, యోగా నేర్చుకున్నాక, అతని జీవిత దృక్పథం పూర్తిగా మారిపోయింది.
కోతులు చూపిన దారి: కొండపైకి వెళ్లిన తొలినాళ్లలో, అక్కడి కోతులు చెట్ల ఆకులను తినడాన్ని గమనించాడు. “అవి తిన్నప్పుడు, నేనెందుకు తినకూడదు?” అనే ఆలోచనతో, తానూ ఆకులను తినడం ప్రారంభించాడు.
పదేళ్లుగా ఆకులే ఆహారం : ప్రస్తుతం, బుడాన్ 80కి పైగా రకాల మొక్కలు, చెట్ల ఆకులను అవలీలగా తినేస్తున్నాడు.
జీవన శైలి : రోజూ తెల్లవారుజామున 2-3 గంటలకే నిద్రలేచి, యోగా చేసి, ఆకులు తిని, సెలయేటి నీళ్లు తాగుతాడు. మళ్లీ రాత్రి 8 గంటలకు యోగా, ఆ తర్వాత ఆకులే ఆహారం. రోజుకు నిద్రపోయేది కేవలం నాలుగున్నర గంటలే.
ఆరోగ్య రహస్యం: “ఈ పదేళ్లలో నాకు జలుబు, జ్వరం వంటివి కూడా రాలేదు. నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది,” అని బుడాన్ చెబుతున్నాడు. అతని బరువు 60 కిలోలు, ఎత్తు 5.9 అడుగులు.
“శబ్దం, గందరగోళం, మనుషుల కదలికలను నేను భరించలేను. ఈ కొండే నా ఇల్లు, ఇక్కడి వాతావరణమే నా స్వర్గం. నాకు భయం లేదు, కోరిక లేదు. ఎంతో సంతృప్తిగా ఉన్నాను.”
– బుడాన్ మాలిక్ హోసమణి
వైద్య ప్రపంచం విస్మయం : బుడాన్ జీవనశైలి, ఆహారపు అలవాట్లు వైద్య ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి.
“అన్ని రకాల ఆకులను జీర్ణం చేసుకునే శక్తి సాధారణంగా జంతువులకే ఉంటుంది. బుడాన్ 80 రకాల ఆకులు తింటుండటం వైద్యపరంగా ఓ అద్భుతం. అతనిపై శాస్త్రీయ పరిశోధన జరగాలి.”
– డాక్టర్ మహంతేశ్ రామన్నవార్, ప్రొఫెసర్, బీఎంకే ఆయుర్వేద మెడికల్ కాలేజ్
బాబా రాందేవ్ వంటి యోగా గురువులు సైతం బుడాన్‌ను ఆహ్వానించినా, అతను తన కొండను, తన ఏకాంత జీవితాన్ని వదిలి వెళ్లేందుకు ఇష్టపడలేదు. డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే సమీప గ్రామాలకు వెళ్లి తాపీ పని చేసుకుంటాడు. మొక్కలు, ఆకులపై అతనికున్న అపార జ్ఞానాన్ని సమాజం సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


