Karnataka SSLC passing marks criteria : ఒకటీ, రెండు మార్కులతో పదో తరగతిలో ఫెయిలై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారా..? సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురుచూస్తూ చదువుకు దూరమవుతున్నారా? ఇలాంటి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టెన్త్ పాసవ్వాలంటే 35 శాతం మార్కులు అవసరం లేదు. మరి, కొత్తగా నిర్దేశించిన పాస్ మార్కులు ఎన్ని..? ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి.?
పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్‌ఎల్‌సీ (పదో తరగతి) పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను 35 శాతం నుంచి 33 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఒకటి, రెండు మార్కుల తేడాతో ఫెయిలై, ఉన్నత చదువులకు దూరమవుతున్న విద్యార్థులను ఆదుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప స్పష్టం చేశారు. ఈ నూతన విధానం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని ఆయన తెలిపారు.
డ్రాపౌట్లను అరికట్టేందుకే ఈ మార్పు: గతంలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో తప్పనిసరిగా 35 శాతం మార్కులు సాధించాల్సి ఉండేది. స్వల్ప తేడాతో ఫెయిలైన విద్యార్థులు, సప్లిమెంటరీ పరీక్షల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. “ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపించడం, ముఖ్యంగా ఆడపిల్లలకైతే చదువు మానిపించి పెళ్లిళ్లు చేయడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు శాశ్వతంగా చదువుకు దూరమవుతున్నారు. ఈ డ్రాపౌట్లను నివారించేందుకే పాస్ మార్కులను తగ్గిస్తున్నాం,” అని మంత్రి మధు బంగారప్ప వివరించారు.
కొత్త నిబంధనలు ఇవే..
పాస్ మార్కులు: తాజా నిబంధన ప్రకారం, ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో 33 శాతం మార్కులు సాధిస్తే విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లే.
మొత్తం మార్కులు: ఎస్ఎస్‌ఎల్‌సీలో మొత్తం 625 మార్కులకు గాను, 33 శాతం అంటే 206 మార్కులు సాధించిన విద్యార్థులను పాస్‌గా ప్రకటిస్తారు.
ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు ఊరట లభించనుంది. స్వల్ప మార్కుల తేడాతో ఆగిపోకుండా, వారు తమ ఉన్నత విద్యా ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.


