కర్ణాటక(Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గులాపురా గ్రామ సమీపంలోని యాలాపురా హైవే వద్ద కూరగాయలు, పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున ట్రక్కులో కూరగాయల లోడుతో సావనూర్ నుంచి కుంత మార్కెట్‌కు వెళ్తున్నారు. యాలాపురా హైవే వద్దకు చేరుకోగానే వాహనం అదుపు తప్పడంతో మరో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో దాదాపు 50 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. రోడ్డుపై లోయకు అడ్డంగా రక్షణ గోడ లేకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపారు.
ఈ ప్రమాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయచూరు, సింధనూరులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 14 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం తరపున తగిన పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు