Karnataka will have a new CM: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. గురువారం సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని, కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. కొత్త సీఎం మే 30న ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కాగా, కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం ఎప్పటినుంచో గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరి మనసూ నొప్పించకుండా ఈ నాయకత్వ మార్పు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాంతో కొన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, గురువారం సిద్ధరామయ్య తొలుత సహచర మంత్రివర్యులకు అల్పాహార విందు ఇచ్చి, అనంతరం బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పిస్తారని సమాచారం. మరోవైపు, డీకే శివకుమార్ రేపు తెల్లవారుజామున ఢిల్లీ నుంచి నేరుగా సీఎం ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ వారు సమావేశం కానున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, గత కొంతకాలంగా సీఎం మార్పుపై కొనసాగుతున్న ఊత్కంఠకు తెరదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read: Nara Lokesh: మాది గూగుల్.. మీది గొడ్డలి.. మహానాడులో వైసీపీకి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
సీఎం రేసులో డీకే, జి.పరవమేశ్వర..
ఇదిలా ఉంటే, కొత్త సీఎం స్థానానికి డీకే శివ కుమార్‌తో పాటు పరమేశ్వర పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. తాను రాజీనామా చేస్తే.. తదుపరి సీఎం పదవిని కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న అహింద వర్గాలకే కేటాయించాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ, దీనికి అధినాయకత్వం సమ్మతిస్తే దళిత నేత, హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వరకు సీఎం పదవి దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు, 2023లో పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీలో భాగంగా తనకు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి తీరాలని అగ్రనేతల ముందు డీకే శివకుమార్ బలంగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

