Karur Stampede TVK Secretary Arrest: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో టీవీకే కరూర్ జిల్లా సెక్రటరీ మథియజగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నలభై మంది మృతికి కారణమైనందున.. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హత్యానేరం, కుట్రకోణం, ప్రజల భద్రతకు ముప్పు కలిగించారనే నెపంతో సోమవారం అదుపులోకి తీసుకోగా.. అతడిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా శనివారం సాయంత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన కరూర్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి చేరింది. 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు నటుడు, టీవీకే అధినేత విజయ్ కూడా ఒక కారణమని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. విజయ్ కావాలనే ర్యాలీకి ఆలస్యంగా వచ్చారని, దాంతో ఆయనను చూసేందుకు జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని తమ నివేదికలో వివరించారు.


