Saturday, November 15, 2025
Homeనేషనల్Karur Stampede: కరూర్ కల్లోలం వెనుక కుట్ర కోణం? - స్టాలిన్ సర్కార్‌పై ఖుష్బూ ఫైర్,...

Karur Stampede: కరూర్ కల్లోలం వెనుక కుట్ర కోణం? – స్టాలిన్ సర్కార్‌పై ఖుష్బూ ఫైర్, విజయ్‌కు బీజేపీ అండ!

Tamil Nadu political conspiracy : తమిళనాడు రాజకీయాలను కుదిపేసిన కరూర్ తొక్కిసలాట ఘటన అనూహ్య మలుపు తిరిగింది. 41 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాదంపై రాజకీయ ఆరోపణలు తారస్థాయికి చేరాయి. నిన్నటి వరకు డీఎంకేతో పాటు బీజేపీని కూడా విమర్శిస్తూ వచ్చిన నటుడు విజయ్‌కు, ఇప్పుడు అదే బీజేపీ నుంచి మద్దతు లభించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ తొక్కిసలాట ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ప్రణాళిక ప్రకారం సృష్టించబడిందా..? తన రాజకీయ ప్రత్యర్థి అయిన విజయ్‌కు బీజేపీ ఎందుకు అండగా నిలుస్తోంది..?

- Advertisement -

తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదని, డీఎంకే సర్కార్ ‘ప్రణాళిక ప్రకారం’ సృష్టించిన తొక్కిసలాట అని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయ్ ర్యాలీకి జనం పోటెత్తుతారని తెలిసి కూడా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇరుకైన స్థలాన్ని కేటాయించిందని, సరైన భద్రత కల్పించడంలో విఫలమైందని ఆమె మండిపడ్డారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తన మౌనాన్ని వీడాలని డిమాండ్ చేసిన ఖుష్బూ, తొక్కిసలాటకు ముందు పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ వ్యాఖ్యలతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

అనూహ్యంగా విజయ్‌కు బీజేపీ మద్దతు: పార్టీ స్థాపించినప్పటి నుంచి డీఎంకేతో పాటు బీజేపీపైనా విమర్శలు చేస్తున్న విజయ్‌కు, ఈ క్లిష్ట సమయంలో బీజేపీ నుంచి మద్దతు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. “విజయ్‌తో మాకు అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ, కరూర్ ఘటన విషయంలో ఆయనకు అండగా నిలుస్తాం” అని బీజేపీ సీనియర్ నేత హెచ్. రాజా ప్రకటించారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఎన్డీఏ ఎంపీల బృందాన్ని బీజేపీ కరూర్‌కు పంపింది. ఆ బృందం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నివేదిక ఇచ్చింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, విజయ్ కోట్లాది అభిమానులను తమవైపు తిప్పుకోవడానికి, అదే సమయంలో తమ రాజకీయ ప్రత్యర్థి డీఎంకేను ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం పన్నిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో, విజయ్ పార్టీ బీజేపీకి ‘బీ-టీమ్’ అంటూ విమర్శలు కూడా మొదలయ్యాయి.

విజయ్‌పై విమర్శలు.. కోర్టులో చుక్కెదురు: మరోవైపు, తొక్కిసలాట జరిగినప్పుడు విజయ్, ఆయన పార్టీ కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టలేదని, బాధితులను పరామర్శించకుండానే విజయ్ చెన్నైకి వెళ్లిపోయారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీకి చెందిన న్యాయవాది జీఎస్ మణి వేర్వేరుగా వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్టులోని మదురై ధర్మాసనం కొట్టివేసింది. పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరడం సరికాదని, న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చవద్దని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad