మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించి, పెద్ద ఎత్తున చేరికలు చేపట్టనున్నట్టు పార్టీ వెల్లడించింది.
బిఆర్ఎస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దార్శనికత దేశ ప్రజలతో పాటు, రాజకీయాల్లో తలపండిన వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులను ఆకట్టుకుంటోందని పార్టీ వివరించింది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా యావత్ దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా సాగుతున్న బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు నచ్చి ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు పలు రాష్ట్రాల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
ఇటీవలి నాందేడ్ సభ పెద్ద ఎత్తున విజయవంతమై భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారి చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. భారత ప్రజల కోసం, వారి అభివృద్ధి సంక్షేమం కోసం బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పడుతున్న తపన, వారి దార్శనికతను మహారాష్ట్ర సహా, ఉత్తర భారత ప్రజలు అర్థం చేసుకున్నారు. తెలంగాణలో విప్లవాత్మక రీతిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రజలను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చారు. ఈమేరకు పలువురు నేతలు హైదరాబాదులో బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే , నాందేడ్ ఇంచార్జీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.