Sunday, November 16, 2025
Homeనేషనల్Kejriwal bungalow : 'శీష్ మహల్' వీడి.. చండీగఢ్‌లో కొత్త మేడ! - కేజ్రీవాల్‌పై బీజేపీ...

Kejriwal bungalow : ‘శీష్ మహల్’ వీడి.. చండీగఢ్‌లో కొత్త మేడ! – కేజ్రీవాల్‌పై బీజేపీ మరో బాణం!

Kejriwal bungalow controversy : దిల్లీలో ‘శీష్ మహల్’ (అద్దాల మేడ) వివాదం సృష్టించిన రాజకీయ ప్రకంపనలు మరువక ముందే, ఇప్పుడు అదే తరహా ఆరోపణలు మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చుట్టుముట్టాయి. సామాన్యుడిని అని చెప్పుకునే కేజ్రీవాల్ కోసం, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం చండీగఢ్‌లో మరో ఏడు నక్షత్రాల విలాసవంతమైన భవనాన్ని కేటాయించిందంటూ బీజేపీ బాంబు పేల్చింది. ఈ ఆరోపణల్లో నిజమెంత? ఇది కేవలం రాజకీయ విమర్శేనా లేక దీని వెనుక వాస్తవం ఉందా? దీనిపై ఆప్, బీజేపీల వాదోపవాదాలేంటి?

- Advertisement -

బీజేపీ ఆరోపణ ఇదే : సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా బీజేపీ, ఒక విలాసవంతమైన భవనం ఫోటోను పంచుకుంటూ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేసింది.

“సామాన్యుడి ముసుగులో ఉన్న వ్యక్తికి ఇది మరో శీష్ మహల్. దిల్లీలోని అద్దాల మేడను ఖాళీ చేసిన తర్వాత, పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతున్న కేజ్రీవాల్ కోసం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కోటాలో ఈ కొత్త విలాస భవనాన్ని నిర్మించారు,” అని బీజేపీ ఆరోపించింది. చండీగఢ్‌లోని సెక్టార్-2లో, రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ 7 స్టార్ భవనాన్ని కేజ్రీవాల్‌కు కేటాయించారని పేర్కొంది. అయితే, ఈ ఫోటోను తొలుత ఆప్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ పంచుకోవడం గమనార్హం. ఆమె కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

తిప్పికొట్టిన ఆప్.. ఆధారం చూపాలని సవాల్ : బీజేపీ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇదొక బోగస్ ప్రచారమని, నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది. “కేజ్రీవాల్‌కు ఇల్లు కేటాయించినట్లు చెబుతున్న బీజేపీ, అందుకు సంబంధించిన అలాట్‌మెంట్ ఆర్డర్‌ను చూపించగలదా?” అని ఆప్ సవాల్ విసిరింది. ప్రధాని మోదీకి సంబంధించిన “ఫేక్ యమూనా స్టోరీ”ని తాము బయటపెట్టినప్పటి నుంచే, బీజేపీ ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆప్ ఎద్దేవా చేసింది.

గతంలో దిల్లీ ‘శీష్ మహల్’ వివాదం : అంతకుముందు కేజ్రీవాల్ దిల్లీ సీఎంగా ఉన్నప్పుడు, ఆయన అధికారిక నివాసమైన 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ బంగ్లాను రూ.45 కోట్ల ప్రజాధనంతో విలాసవంతంగా పునర్నిర్మించారని బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. దానిని ‘శీష్ మహల్’గా అభివర్ణిస్తూ, అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ అవినీతి ఆరోపణలు ఎన్నికల్లో ఆప్‌ను దెబ్బతీసి, బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. ఆ తర్వాత, కేజ్రీవాల్ నివసించిన ఆ బంగ్లాలో తమ ముఖ్యమంత్రి నివసించరని బీజేపీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ‘శీష్ మహల్‌’ను ప్రభుత్వ అతిథి గృహంగా మార్చనున్నట్లు దిల్లీలోని బీజేపీ సర్కార్ ప్రకటించింది.
ఇదిలా ఉండగా, దిల్లీ మాజీ సీఎంగా కేజ్రీవాల్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 95, లోధి ఎస్టేట్‌లో టైప్ VII బంగ్లాను అధికారిక నివాసంగా కేటాయించింది. ఈ నేపథ్యంలో, పంజాబ్‌లో మరో కొత్త భవనం కేటాయింపు ఆరోపణలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad