Homeనేషనల్Education : కేంద్రీయాల్లో కీలక కదలిక: సంస్కృత సెక్షన్ ఇక తప్పనిసరి.. మూడో భాషగా మాతృభాషకూ...

Education : కేంద్రీయాల్లో కీలక కదలిక: సంస్కృత సెక్షన్ ఇక తప్పనిసరి.. మూడో భాషగా మాతృభాషకూ ఛాన్స్!

Sanskrit mandatory in Kendriya Vidyalaya : మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలోనూ సమూల మార్పులు వస్తున్నాయి. జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా తాజాగా కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KV Schools) ఇకపై ఆ రెండు తరగతుల్లో సంస్కృతం బోధన కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉండి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అలాగే, మూడో భాషగా మాతృభాషను (ప్రాంతీయ భాషను) ఎంచుకునే సువర్ణావకాశాన్ని సైతం విద్యార్థులకు కల్పించింది. 

- Advertisement -

ఆ రెండు తరగతుల్లో సంస్కృతం పక్కా!  : కేంద్ర విద్యాశాఖ పరిధిలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) మే 29న కీలక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో 6వ, 9వ తరగతుల్లో కనీసం ఒక ‘సంస్కృత సెక్షన్’ తప్పనిసరిగా ఉండాలి. జాతీయ విద్యా విధానంలోని ‘త్రిభాషా సూత్రం’ అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

మూడో భాషగా మన ప్రాంతీయ భాష.. కానీ ఆ షరతు తప్పనిసరి : కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు మొదటి భాష (R1)గా హిందీని, రెండో భాష (R2)గా ఇంగ్లీష్‌ను చదువుతారు. ఇక మూడో భాష (R3) కింద సంస్కృతం లేదా తమ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాష (ఉదాహరణకు తెలుగు)ను ఎంచుకోవచ్చు. అయితే వారు ఎంచుకునే మూడో భాష కచ్చితంగా భారత రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ భాషల జాబితాలో ఉండాలి. విద్యార్థులు తమకు నచ్చిన భాషను ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రం ఒక సెక్షన్‌ కచ్చితంగా సంస్కృత మాధ్యమంలో కొనసాగాలి. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తరచూ వివిధ రాష్ట్రాలకు బదిలీ అవుతుంటారు. వారి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఒకే కరిక్యులమ్ ఉండేలా ‘సంస్కృతం’ సెక్షన్‌ను తప్పనిసరి చేశారు.

సెక్షన్ల విభజన ఇలా.. ‘సమాగమ్’ పోర్టల్‌లో నమోదు : విద్యార్థులు ఎంచుకున్న మూడో భాష ఆధారంగానే పాఠశాలల్లో సెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒకే భాషను ఎంచుకున్న వారిని ఒక సెక్షన్‌లో కూర్చోబెడతారు. పాఠశాలలో కేవలం ఒకే సెక్షన్ ఉంటే.. అందులో సంస్కృతం, ప్రాంతీయ భాషలకు వేర్వేరు బ్యాచ్‌లు (కనీసం 15 మంది) ఏర్పాటు చేయాలి.రెండు సెక్షన్లు ఉంటే.. ఒక సెక్షన్ సంస్కృతానికి, మరొకటి ప్రాంతీయ భాషకు కేటాయిస్తారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సెక్షన్లు ఉంటే.. విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రిన్సిపాల్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఒక్క సెక్షన్ మాత్రం కచ్చితంగా సంస్కృతానిదే అయి ఉండాలి.ఈ ఎంపికల వివరాలను ‘సమాగమ్’ (Samagam) పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా.. పాఠశాలలకు ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమో కేవీఎస్ (KVS) అంచనా వేయనుంది.

సీబీఎస్ఈ కీలక ఊరట.. టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ లో ‘నో టెన్షన్’ : జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పన (NCF-SE 2023) మార్గదర్శకాల ప్రకారం.. జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ మూడు భాషల అధ్యయనాన్ని తప్పనిసరి చేసింది. అయితే, ఇక్కడ విద్యార్థులకు కేంద్రం ఒక తీపికబురు అందించింది. 10వ తరగతి బోర్డు పరీక్షల సమయంలో ఈ ‘మూడో భాష’ (R3)పై ప్రత్యేకంగా ఎలాంటి పబ్లిక్ పరీక్ష ఉండదని స్పష్టం చేసింది. కేవలం భాష నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టేలా ఈ వెసులుబాటు కల్పించింది. ఇక 2026-27 సంవత్సరంలో 9వ తరగతి చదివే విద్యార్థులు, కొత్త పాఠ్యపుస్తకాలు వచ్చే వరకు ప్రస్తుతమున్న 8వ తరగతి మూడో భాష పుస్తకాలను వినియోగించుకోవాలని సూచించింది.

దేశవ్యాప్తంగా భాషా వైవిధ్యం : కేవీఎస్ తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం దేశవ్యాప్తంగా భాషా బోధనలో కొత్త శకానికి నాంది పలకనుంది. ప్రాచీన భాష అయిన సంస్కృతానికి ప్రాణం పోయడంతో పాటు, మాతృభాషల గొప్పదనాన్ని భావితరాలకు అందించేందుకు ఈ సరికొత్త విధానం దోహదపడుతుందని విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News