Child Rape Case 22 Years Sentence: బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు ఓ కామాంధుడు. 18 నెలల చిన్నారిపై ఆ కీచకుడు చేసిన అఘాయిత్యానికి ఆగ్రహించిన కోర్టు.. కఠిన కారాగార శిక్ష విధించి ఆ కుటుంబానికి కాస్తంత ఉపశమనం కల్పించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళలోని తిరువనంతపురంలో 18 నెలల బాలికను కిడ్నాప్ చేసి, చిన్నారిని దారుణంగా హింసించిన కామాంధుడికి.. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంకా రూ. 72,000 భారీ జరిమానా విధించింది. అయిరూర్ సమీపంలోని ఎడవ నివాసి హసన్ కుట్టి అలియాస్ కబీర్(41)పై ఇప్పటికే ఎన్నో తీవ్రమైన నేరాలకు పాల్పడటంతో అతనిపై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2022లో నిందితుడు ఓ చిన్నారిని వేధింపులకు గురి చేయడంతో అయిరూర్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదు కాగా.. 2024లో మరో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Also Read: https://teluguprabha.net/national-news/madras-hc-on-tvk-plea/
కాగా, హైదరాబాద్‌కు చెందిన దంపతులు తమ 18 నెలల కూతురితో కలిసి బతుకుతెరువు కోసం తిరువనంతపురంలోని చక్కాలో రోడ్డు పక్కన నివాసం ఉండేవారు. గతేడాది ఫిబ్రవరి 19న రాత్రి సమయంలో ఆ బాలిక నిద్రిస్తుండగా.. అదే సమయంలో నిందితుడు హసన్ మెల్లగా వచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఆ బాలికను కిడ్నాప్ చేసి.. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక ఉన్న రైల్వే పట్టాల సమీపంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత ఆ చిన్నారి స్పృహ తప్పి పడిపోవడంతో.. ఆమె చనిపోయిందనుకుని పక్కనే ఉన్న పొదల్లో విసిరేసి పారిపోయాడు. తెల్లవారుజామున నిద్రలేచేసరికి తమ పాప కనిపించకపోవడంతో.. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటి రోజు చిన్నారి పొదల్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Also Read: https://teluguprabha.net/national-news/aadhaar-update-charges-hike-from-october-1st/
వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. అనంతరం నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాదాపు 100కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. చివరికి రెండు వారాల తర్వాత కొల్లంలోని చిన్నక్కడ ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేశారు. నాలుగు నెలల విచారణ అనంతరం.. కామాంధుడికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది.


