Kerala digital literacy program : “వయసు పైబడింది, ఇక మా వల్ల కాదు” అని నిట్టూర్చే ఎందరికో ఆయనొక స్ఫూర్తి ప్రదాత. నేర్చుకోవాలనే తపన ఉంటే శతాధిక వసంతాలు కూడా అడ్డంకి కావని నిరూపించిన ఆదర్శమూర్తి. ఒకప్పుడు దినపత్రిక పుటలలో ప్రపంచాన్ని చూసిన ఆయన, ఇప్పుడు 105 ఏళ్ల వయసులో స్మార్ట్‌ఫోన్ తెరపై విశ్వాన్ని వీక్షిస్తున్నారు. ఆయనే కేరళలోని పెరుంబవూర్, అసమన్నూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఎం.ఏ. అబ్దుల్లా మౌలవీ. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజి కేరళ’ ప్రాజెక్టుకు ఆయన ఇప్పుడు ప్రచారకర్తగా, ‘డిజిటల్ ఐకాన్’గా నిలిచారు. ఇంతకీ, వార్తాపత్రికలు చదువుకునే ఈ వృద్ధుడికి స్మార్ట్‌ఫోన్‌పై ఎందుకంత ఆసక్తి కలిగింది..? ఈ వయసులో ఆయన టెక్నాలజీని ఎలా ఒంటపట్టించుకున్నారు
కరోనా తెచ్చిన మార్పు : అబ్దుల్లా మౌలవీకి చిన్నప్పటి నుంచి దినపత్రికలు చదవడం ప్రాణం. కానీ, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్-19 మహమ్మారి ఆయన అలవాటుకు అడ్డుకట్ట వేసింది. లాక్‌డౌన్ కారణంగా వార్తాపత్రికల సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేక ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకరోజు తన కుమారుడు ఫైజల్ అలీని, “ఫోన్‌లో పేపరు చదవడం సాధ్యమేనా?” అని అమాయకంగా అడిగారు. “సాధ్యమే” అని కొడుకు చెప్పిన ఆ ఒక్క మాటే, ఆయనలో డిజిటల్ ప్రపంచంపై అంతులేని ఆసక్తిని రేకెత్తించింది.
కుటుంబం నుంచి వాలంటీర్ వరకు.. నేర్పిన పాఠం : “నా తండ్రి కోరికను నెరవేర్చాలని నేను, నా పిల్లలు నిర్ణయించుకున్నాం,” అని ఫైజల్ అలీ గర్వంగా చెబుతారు. మొదట మనవడు షకీర్, తాతయ్యకు స్మార్ట్‌ఫోన్ ప్రాథమిక పాఠాలు నేర్పించాడు. ఆ తర్వాత ‘డిజి కేరళ’ కార్యక్రమంలో భాగంగా, అసమన్నూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఒక వాలంటీర్ స్వయంగా అబ్దుల్లా ఇంటికే వచ్చి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అసాధారణమైన జ్ఞాపకశక్తి, నేర్చుకోవాలనే పట్టుదలతో, అతి తక్కువ సమయంలోనే అబ్దుల్లా టెక్నాలజీని తన అరచేతిలోకి తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఆయన వాయిస్ టైపింగ్ ద్వారా యూట్యూబ్‌లో తనకు నచ్చిన వార్తలను, ప్రసంగాలను వెతుక్కుని మరీ చూస్తున్నారు. ఫేస్‌బుక్, గూగుల్ వంటివి అవలీలగా వాడేస్తున్నారు. అంతెందుకు, విదేశాల్లో ఉంటున్న మనవడితో ప్రతిరోజూ వీడియో కాల్ చేసి ముచ్చటిస్తున్నారు.
మంత్రి నుంచి కానుక.. ప్రభుత్వ సత్కారం : ఈ శతాధిక డిజిటల్ యోధుడి గురించి తెలుసుకున్న కేరళ స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎం.బీ. రాజేశ్, స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి సత్కరించారు. ఇప్పటివరకు కొడుకు, మనవళ్ల ఫోన్లు వాడుతున్నారని తెలుసుకుని, ఆయనకు ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా అందించారు. ఫోన్ వాడటం కష్టంగా అనిపించిందా అని మంత్రి అడగ్గా, “అదేం లేదు, చాలా సులభం!” అని అబ్దుల్లా చిరునవ్వుతో సమాధానమిచ్చారు. అంతేకాదు, మంత్రి ముందే విదేశాల్లో ఉన్న మనవడికి వీడియో కాల్ చేసి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆగస్టు 21న కేరళను 99.99% డిజిటల్ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి స్వయంగా అబ్దుల్లాను ఆహ్వానించారు.
ఇది ‘రియల్ కేరళ స్టోరీ’ : “అబ్దుల్లా మౌలవీ నిజమైన హీరో, రాష్ట్రానికే గర్వకారణం. ఇది కదా ‘రియల్ కేరళ స్టోరీ’ అంటే,” అని మంత్రి రాజేశ్ వ్యాఖ్యానించారు. “కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 65 ఏళ్ల లోపు వారికి డిజిటల్ అక్షరాస్యత కల్పిస్తే సరిపోతుంది. కానీ కేరళ ప్రభుత్వం వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ ఈ యజ్ఞంలో భాగం చేసింది. అందుకు 105 ఏళ్ల అబ్దుల్లానే నిలువెత్తు నిదర్శనం. ఈ విషయంలో కేరళ దేశానికే ఒక ఆదర్శం,” అని ఆయన కొనియాడారు.


