Farmer grows 150 pineapple varieties : పైనాపిల్ అంటే మనకు ఒకటో, రెండో రకాలు తెలుసు. కానీ, కేరళకు చెందిన ఓ రైతు ఏకంగా 150 రకాల పైనాపిల్స్‌ను ఒకే ఎకరంలో పండిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఫిలిప్పైన్స్ నుంచి బ్రెజిల్ వరకు, తైవాన్ నుంచి నైజీరియా వరకు.. ప్రపంచంలోని నలుమూలల నుంచి అరుదైన రకాలను సేకరించి, తన తోటను ఓ ‘పైనాపిల్ ప్రపంచం’గా మార్చేశారు. అసలు ఎవరీ డయాస్ పి. వర్గీస్..? ఈ అరుదైన సాగు వెనుక ఉన్న ఆయన కష్టం, ఇష్టం ఎలాంటిది..?
అరుదైన రకాల సేకరణే ఆయన అభిరుచి : కేరళకు చెందిన రైతు డయాస్ పి. వర్గీస్‌కు మొక్కల పెంపకం అంటే ప్రాణం. ఎనిమిదేళ్ల క్రితం పైనాపిల్ సాగు మొదలుపెట్టినా, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మధ్యలో వదిలేశారు. కానీ, రెండున్నరేళ్ల క్రితం మళ్లీ తన అభిరుచికి పదును పెట్టారు. అరుదైన, విదేశీ పైనాపిల్ రకాలను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.4.5 లక్షల పెట్టుబడి: ఈ అరుదైన మొక్కల సేకరణ కోసం ఆయన సుమారు రూ.4.5 లక్షలు ఖర్చు చేశారు.
150 రకాలు: ప్రస్తుతం ఆయన తోటలో ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, బ్రెజిల్, శ్రీలంక, హోండూరస్ వంటి అనేక దేశాలకు చెందిన 150 రకాల పైనాపిల్ మొక్కలు ఉన్నాయి.
విభిన్న పరిమాణాలు: ఈ పండ్లలో కొన్ని 200 గ్రాముల బరువుంటే, మరికొన్ని ఏకంగా 20 కిలోల వరకు తూగుతున్నాయి.
అమ్మకానికి కాదు.. కేవలం సేకరణకే : ప్రస్తుతం 30 రకాల పైనాపిల్స్ కాపుకొచ్చినా, డయాస్ వాటిని అమ్మడం లేదు. ఎందుకంటే, ఒక్కో రకానికి చెందినవి ఒకటి, రెండు మొక్కలే ఉండటం, వాటికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో, వాటి నుంచి కొత్త మొక్కలను అభివృద్ధి చేయడంపైనే ఆయన దృష్టి సారించారు. కొన్ని అరుదైన రకాల మొక్కల ధర ఏకంగా రూ.12,000 వరకు పలుకుతోందని ఆయన తెలిపారు.
“ఇంటి చుట్టూ పండ్ల మొక్కలు పెంచడం నాకిష్టం. కొత్త రకం పైనాపిల్ కనిపిస్తే ఇంటికి తీసుకురావడం అలవాటుగా మారింది. వాటి మధ్య ఉంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. నా లక్ష్యం 200 రకాలను సేకరించడమే.”
– డయాస్ పి. వర్గీస్, రైతు
పైనాపిలే కాదు.. పండ్ల వనం : డయాస్ తోటలో కేవలం పైనాపిలే కాదు, 50 రకాల జామ, అరుదైన అరటి, రేగు, ఇండోనేషియన్ కెసుజు వంటి 60 రకాల విదేశీ పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. ఈ పండ్ల తోట పెంపకంలో ఆయనకు భార్య షీబా, కుమారుడు జాకబ్ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. డయాస్ అంకితభావం, పట్టుదల స్థానికులకు స్ఫూర్తినిస్తోందని కౌన్సిలర్ పీసీ భాస్కరన్ ప్రశంసించారు.


