Sunday, November 16, 2025
Homeనేషనల్Digital Literacy: అక్షర కేరళం.. ఇక డిజిటల్ కేరళం.. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

Digital Literacy: అక్షర కేరళం.. ఇక డిజిటల్ కేరళం.. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

Digital Literacy Rate In Kerala: వంద శాతం అక్షరాస్యతతో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేరళ, ఇప్పుడు మరో చరిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకుంది. సాంకేతిక యుగంలో మరో అడుగు ముందుకేసి, దేశంలోనే తొలి ‘పూర్తి డిజిటల్ అక్షరాస్యత’ సాధించిన రాష్ట్రంగా అవతరించింది. ఆగస్టు 21న ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇంతకీ, ఈ అసాధారణ మైలురాయిని కేరళ ఎలా చేరుకుంది..? ‘డిజి కేరళం’ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏమిటి..? కోట్లాది మంది ప్రజలను డిజిటల్ బాట పట్టించిన ఆ పటిష్టమైన ప్రణాళిక ఎలాంటిది..?

- Advertisement -

అక్షర జ్ఞానంలో అగ్రగామిగా నిలిచిన కేరళ, ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేసింది. వయసు, విద్య, ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా ప్రతి పౌరుడికీ డిజిటల్ సాంకేతికత ఫలాలను అందించాలనే మహోన్నత లక్ష్యంతో చేపట్టిన ‘డిజి కేరళం’ ప్రాజెక్టు విజయవంతమైంది. ఈ నెల 21వ తేదీన తిరువనంతపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళను దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించనున్నారు.

పుల్లంపుర స్ఫూర్తితో.. రాష్ట్రవ్యాప్త యజ్ఞం : దేశంలోనే తొలి పూర్తి డిజిటల్ అక్షరాస్యత పంచాయతీగా రికార్డు సృష్టించిన తిరువనంతపురం జిల్లాలోని ‘పుల్లంపుర’ గ్రామం, ఈ బృహత్తర కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ విజయాన్ని ఆదర్శంగా తీసుకున్న కేరళ ప్రభుత్వం, 2022లో ‘డిజి కేరళం’ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వ సేవలు, ఆన్‌లైన్ చెల్లింపులు, ధ్రువపత్రాల జారీ వంటివి డిజిటల్ రూపంలోకి మారుతున్న తరుణంలో, ఏ ఒక్క పౌరుడు కూడా సాంకేతిక పరిజ్ఞానం లేక వెనుకబడకూడదన్నదే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

ALSO READ: https://teluguprabha.net/national-news/mallikarjun-kharge-criticizes-bjp-independence-day-2025/

కార్యాచరణ ఇలా సాగింది..
గుర్తింపు: తొలి దశలో, 14 ఏళ్లు పైబడిన వారిలో డిజిటల్ పరిజ్ఞానం లేని వారిని గుర్తించడానికి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. 83 లక్షల కుటుంబాల్లోని 1.5 కోట్ల ప్రజలను సర్వే చేయగా, 21,88,398 మందిని డిజిటల్ నిరక్షరాస్యులుగా గుర్తించారు.

శిక్షణ: గుర్తించిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో స్మార్ట్‌ఫోన్ వాడకం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో/ఆడియో కాల్స్, ఫోటోలు/వీడియోలు డౌన్‌లోడ్ చేయడం వంటి ప్రాథమిక అంశాలతో పాటు, యూట్యూబ్, సోషల్ మీడియా వినియోగం, ప్రభుత్వ ఈ-సేవలు పొందడం, ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడంపై సమగ్ర అవగాహన కల్పించారు.

పరీక్ష: శిక్షణ అనంతరం, ఆర్థిక మరియు గణాంక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా ప్రత్యేక మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్ ద్వారా పరీక్ష నిర్వహించారు.

ఫలితం  : శిక్షణ పొందిన 21,87,966 మందిలో, 21,81,667 మంది (99.98%) విజయవంతంగా పరీక్షలో ఉత్తీర్ణులై డిజిటల్ అక్షరాస్యులుగా నిలిచారు. మొదటిసారి పరీక్షలో నెగ్గని వారికి తిరిగి శిక్షణతో పాటు మరో పరీక్షను నిర్వహించే ఏర్పాటు చేశారు. ఈ విజయంతో, ప్రభుత్వ పథకాలను నేరుగా పొందడంలోనూ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావడంలోనూ కేరళ ప్రజలు ఇక ముందు వరుసలో నిలవనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad