Sabarimala Gold Missing: ప్రముఖ పుణ్యక్షేత్రం కేరళలోని శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి పలకలను మరమ్మతుల కోసం పంపించిన వ్యవహారం తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ రాగి పలకల నుంచి కొంత బంగారం తగ్గడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
2019లో శబరిమల ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు పూత పూసిన రాగి పలకలను తాపడం కోసం తొలగించారు. అప్పుడు వాటి బరువు 42.8 కిలోలు కాగా.. మరమ్మతుల కోసం చెన్నైకి చెందిన సంస్థకు అప్పగించేసరికి వాటి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. దాదాపు 4.54 కిలోల మేర బంగారం వ్యత్యాసం కనిపించింది. అయితే ఓ భక్తుడి ద్వారా వాటిని చెన్నైకి పంపడం కూడా వివాదానికి దారి తీయడంతో.. ఈ వ్యవహారంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బంగారు పూత పూసిన రాగి పలకల వ్యత్యాసం తగ్గిపోవడం.. చాలా తీవ్రమైన, వివరణ లేని వ్యత్యాసం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరణాత్మక విచారణ అవసరమని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కేవలం ఆరేళ్లకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు.
దీంతో 2019లో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు మరమ్మతులు చర్యలు చేపట్టింది. అయితే, వారు స్పెషల్ కమిషనర్‌కు గానీ, కోర్టుకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ బంగారు రేకులను తొలగించడం వివాదానికి కారణమైంది. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.


