Kerala High Court sex worker rights : డబ్బు చెల్లించి లైంగిక సేవలు పొందే వ్యక్తిని ‘వినియోగదారుడు’ (కస్టమర్) అని పిలవచ్చా..? లైంగిక కార్యకలాపంలో పాల్గొనే సెక్స్ వర్కర్‌ను ఒక ‘వస్తువు’గా లేక ‘సేవ’గా పరిగణించవచ్చా..? సమాజంలో వేళ్లూనుకుపోయిన ఈ పదజాలానికి, ఆలోచనా విధానానికి చట్టం అంగీకారం తెలుపుతుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తూ, సామాజిక దృక్పథంలో నూతన అధ్యాయానికి తెరలేపుతూ కేరళ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.
వ్యభిచార గృహానికి వెళ్లే వ్యక్తిని ‘వినియోగదారుడు’ అనడం చట్టప్రకారం చెల్లదని, సెక్స్ వర్కర్ గౌరవాన్ని కించపరిచేలా వారిని ‘వస్తువు’గా చూడలేమని తేల్చి చెప్పింది. ఇంతకీ న్యాయస్థానం ఈ నిర్ధారణకు రావడానికి దారితీసిన పరిస్థితులేమిటి..? ఈ తీర్పు చట్టపరంగా తీసుకురాబోయే మార్పులేమిటి..?
అసలు కేసు ఇదే : ఈ కీలక తీర్పునకు నేపథ్యంగా నిలిచింది 2021లో తిరువనంతపురంలో నమోదైన ఒక కేసు. నగర పోలీసులు ఒక వ్యభిచార గృహంపై దాడి చేసి, ఒక మహిళతో పాటు అక్కడున్న ఒక వ్యక్తిని కూడా ‘అనైతిక అక్రమ రవాణా నిరోధక చట్టం’ (Immoral Traffic Prevention Act) కింద అరెస్టు చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ వీజీ అరుణ్ నేతృత్వంలోని ధర్మాసనం, చట్టంలోని లొసుగులను, పదాల వెనుక ఉన్న సామాజిక వాస్తవాలను లోతుగా విశ్లేషించింది.
హైకోర్టు లోతైన విశ్లేషణ: చట్టం ఏం చెబుతోంది : జస్టిస్ వీజీ అరుణ్ తన తీర్పులో చట్టాన్ని కేవలం అక్షరాల రూపంలో కాకుండా, దాని వెనుక ఉన్న ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
‘కస్టమర్’ నిర్వచనంపై స్పష్టత: “ఒక వ్యక్తిని కస్టమర్ అని సంబోధించాలంటే, అతను డబ్బు చెల్లించి ఏదైనా వస్తువును కొనుగోలు చేయడం లేదా సేవను పొందడం జరగాలి. కానీ ఇక్కడ ఒక సెక్స్ వర్కర్‌ను మనం ‘వస్తువు’గా పరిగణించలేం. అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుంది,” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్య, సెక్స్ వర్కర్లను కేవలం లైంగిక వస్తువులుగా చూసే సామాజిక ధోరణిని తిరస్కరించింది.
డబ్బు చెల్లింపు ఒక ‘ప్రలోభం’ మాత్రమే: సేవలు పొందే వ్యక్తి చెల్లించే డబ్బును, ఆ సేవకు వెలకట్టడంగా కాకుండా, సదరు సెక్స్ వర్కర్‌ను లైంగిక చర్యకు ప్రేరేపించడానికి లేదా ప్రలోభపెట్టడానికి ఇచ్చిన ప్రతిఫలంగానే చూడాలని కోర్టు అభిప్రాయపడింది. “నిజానికి ఆ డబ్బులో కూడా అధిక భాగం వ్యభిచార గృహ నిర్వాహకుల జేబుల్లోకే వెళ్తుంది. కాబట్టి, ఆ వ్యక్తి డబ్బు ద్వారా ఒకరిని వ్యభిచారంలోకి ప్రేరేపిస్తున్నాడు,” అని ధర్మాసనం వివరించింది.
బలవంతపు వృత్తి కోణం: చాలా సందర్భాల్లో మానవ అక్రమ రవాణా బాధితులు, పేదరికం, నిస్సహాయత వంటి కారణాలతోనే ఎందరో మహిళలు ఈ వృత్తిలోకి బలవంతంగా నెట్టబడతారని కోర్టు గుర్తుచేసింది. ఇతరుల లైంగిక వాంఛలను తీర్చడానికి వారు తమ శరీరాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందన్న వాస్తవాన్ని విస్మరించలేమని పేర్కొంది.
తీర్పులోని కీలక అంశాలు: ఊరట, విచారణ : ఈ లోతైన విశ్లేషణ అనంతరం, హైకోర్టు పిటిషనర్‌కు పాక్షిక ఊరట కల్పించింది.
కొట్టివేసిన సెక్షన్లు: వ్యభిచార గృహం నడపడం (సెక్షన్ 3), వ్యభిచారం ద్వారా వచ్చే సంపాదనపై ఆధారపడి జీవించడం (సెక్షన్ 4) వంటి అభియోగాల నుంచి అతనికి మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే అతను నిర్వాహకుడు కాదు, కేవలం అక్కడికి వెళ్లిన వ్యక్తి మాత్రమే.
కొనసాగనున్న విచారణ: అయితే, ఒక వ్యక్తిని వ్యభిచారంలోకి ప్రేరేపించడం (సెక్షన్ 5(1)(డి)), బహిరంగ ప్రదేశాలకు సమీపంలో వ్యభిచారం చేయడం (సెక్షన్ 7) వంటి సెక్షన్ల కింద మాత్రం విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఈ తీర్పుతో ఒకవైపు పిటిషనర్‌కు కొన్ని అభియోగాల నుంచి విముక్తి లభించినప్పటికీ, మరోవైపు సెక్స్ వర్కర్ల సేవలను పొందే వారిని చట్టం ఏ దృష్టితో చూస్తుందనే దానిపై ఒక కీలకమైన స్పష్టత వచ్చింది. వారిని ‘వినియోగదారులు’గా కాకుండా, వ్యభిచారానికి ‘ప్రేరేపకులు’గా చట్టం పరిగణిస్తుందన్న సందేశాన్ని ఈ తీర్పు బలంగా పంపింది.


