Kerala bumper lottery winner : అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం! రాత్రికి రాత్రే ఓ సాధారణ వ్యక్తిని కోటీశ్వరుణ్ని చేయగల శక్తి లాటరీకి ఉంది. కేరళలో సరిగ్గా అదే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తిరువోణం బంపర్ లాటరీలో ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా రూ.25 కోట్ల మెగా జాక్‌పాట్‌ను కొట్టాడు. ఫలితాలు వెలువడి గంటలు గడుస్తున్నా, ఆ అదృష్టశాలి ఎవరనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. అసలు ఎవరా అజ్ఞాత కోటీశ్వరుడు? ఎందుకు ఇంకా బయటకు రాలేదు..? ఆ జాక్‌పాట్ టికెట్‌ను అమ్మిన వ్యక్తి కథేంటి..?
కేరళ రాష్ట్ర లాటరీ చరిత్రలోనే అతిపెద్ద బహుమతి అయిన తిరువోణం బంపర్ లాటరీ-2025 ఫలితాలు సర్వత్రా ఉత్కంఠను రేపాయి. TH 577825 నంబరు గల టికెట్‌కు రూ.25 కోట్ల మొదటి బహుమతి వరించింది. ఈ అదృష్ట టికెట్‌ను ఎర్నాకులంలోని నెట్టూర్‌కు చెందిన లాటరీ ఏజెంట్ లతీఫ్ విక్రయించారని తేలింది. అయితే, విజేత ఎవరనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. డ్రాకు కేవలం ఒక్క రోజు ముందు ఆ టికెట్‌ను అమ్మినట్లు తెలిపిన లతీఫ్, అది నెట్టూర్ పరిసర ప్రాంతవాసే కొనుగోలు చేసి ఉండవచ్చని, అయితే కచ్చితంగా ఎవరు కొన్నారో తనకు గుర్తులేదని చెప్పాడు.
వ్యాపారి నుంచి ‘అదృష్ట’ ఏజెంట్‌గా : ఒకప్పుడు కొబ్బరి నూనె వ్యాపారంలో నష్టాలను చవిచూసిన లతీఫ్, రెండేళ్ల క్రితం లాటరీ టికెట్ల ఏజెన్సీని ప్రారంభించాడు. ఇప్పుడు ఈ జాక్‌పాట్ టికెట్‌ను అమ్మడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. విశేషమేమిటంటే, లతీఫ్ అమ్మిన టికెట్‌కు మొదటి బహుమతి రావడం గత మూడు నెలల్లో ఇది రెండోసారి. మూడు నెలల క్రితం అతను అమ్మిన మరో టికెట్‌కు రూ. కోటి జాక్‌పాట్ తగిలింది.
“నేను అమ్మిన టికెట్‌కే రూ.25 కోట్ల బహుమతి వచ్చిందని తెలిసి మాటలు రాలేదు. లక్షల టికెట్లలో గెలిచే టికెట్‌ను అమ్మగలగడం దేవుడి దయ. ప్రతి టికెట్‌ను ఆశతోనే అమ్మాను, కానీ మొదటి బహుమతి నా చేతుల మీదుగానే వెళ్తుందని ఊహించలేదు. ఆ విజేత ఎవరైనా, వారికి నా శుభాకాంక్షలు,” అని లతీఫ్ అన్నాడు.
విజేతకు దక్కేది ఎంత : లాటరీ గెలిచిన వారికి పూర్తి మొత్తం చేతికి రాదన్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం, రూ.25 కోట్ల బహుమతిలో ముందుగా ఏజెంట్ కమీషన్ 10% (అంటే రూ.2.5 కోట్లు) లతీఫ్‌కు చెల్లిస్తారు. మిగిలిన మొత్తంపై పన్నులు, సర్‌చార్జీలు పోగా నికర మొత్తం విజేతకు అందుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు, సర్‌చార్జీలు (సుమారు రూ. 9 కోట్లకు పైగా) కోత విధించగా, విజేత చేతికి సుమారు రూ. 15.40 కోట్లు అందనుంది.
వచ్చేసింది పూజా బంపర్ : ఇదిలా ఉండగా, తదుపరి బంపర్ లాటరీని కూడా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. “పూజ బంపర్ లాటరీ” టికెట్లను రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ శనివారం విడుదల చేశారు. ఈ లాటరీలో మొదటి బహుమతి రూ.12 కోట్లుగా నిర్ణయించారు. టికెట్ ధర రూ.300 కాగా, డ్రా నవంబర్ 22న జరగనుంది.


