Suicide due to social media shaming : సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ 18 సెకన్ల వీడియో.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ యువతి చేసిన ఆరోపణలు, లక్షలాది మందికి చేరి, తీవ్ర అవమానానికి గురైన ఓ వ్యక్తి, తనువు చాలించాడు. కేరళలో జరిగిన ఈ విషాద ఘటన, సోషల్ మీడియా విచక్షణారహిత వినియోగం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో కళ్లకు కడుతోంది.
కోజికోడ్‌కు చెందిన దీపక్ (42), ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. జనవరి 16న, షింజిత్ ముస్తఫా అనే యువతి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
వైరల్ అయిన వీడియో: “రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణిస్తుండగా, దీపక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు,” అని ఆరోపిస్తూ ఆమె 18 సెకన్ల వీడియోను అప్‌లోడ్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారి, 20 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది.
అవమానంతో ఆత్మహత్య : ఈ వీడియో వైరల్ అవ్వడంతో, దీపక్ తీవ్ర మానసిక క్షోభకు, సామాజిక అవమానానికి గురయ్యాడు. వీడియో పోస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత, జనవరి 18న, అతను గోవిందపురంలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. సోషల్ మీడియాలో జరిగిన పరువు హత్యే, తన ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
యువతిపై కేసు.. పరారీలో నిందితురాలు : ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. దీపక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, కోజికోడ్ మెడికల్ కాలేజ్ పోలీసులు, షింజిత్ ముస్తఫాపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద కేసు నమోదు చేశారు. అయితే, అప్పటికే షింజిత్ ముస్తఫా పరారైందని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. విమర్శలు వెల్లువెత్తడంతో, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించింది.
విచారణకు ఆదేశం: ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) కూడా తీవ్రంగా స్పందించింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి, వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ విషాద ఘటన, సోషల్ మీడియాను ఓ ఆయుధంగా వాడుకుని, విచారణ లేకుండానే శిక్షలు విధించే ‘నెటిజన్ల న్యాయస్థానం’ ఎంత ప్రమాదకరమో మరోసారి హెచ్చరిస్తోంది.

