Bike stunts on President’s route : దేశ ప్రథమ పౌరురాలి భద్రతకే సవాల్ విసిరారు.. కట్టుదిట్టమైన భద్రత ఉన్న మార్గంలోనే బైక్‌పై విన్యాసాలు చేశారు! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా, కేరళలో ముగ్గురు ఆకతాయి యువకులు చేసిన ఈ నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. అయితే, వారి ఆటలు ఎంతోసేపు సాగలేదు. కేరళ పోలీసులు తమదైన శైలిలో వారికి ‘స్పెషల్ ట్రీట్‌మెంట్’ ఇచ్చి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అదిప్పుడు వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగింది…?
ఇటీవల కేరళ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పాల ప్రాంతంలోని ఓ మార్గంలో ప్రయాణించాల్సి ఉండగా, పోలీసులు ఆ రూట్‌లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు.
నిబంధనల ఉల్లంఘన: అయితే, ముగ్గురు యువకులు నిబంధనలను బేఖాతరు చేస్తూ, తమ బైక్‌పై ఆ హై-సెక్యూరిటీ జోన్‌లోకి దూసుకొచ్చారు.
పోలీసులను ధిక్కరించి.. విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి వారిని ఆపడానికి ప్రయత్నించినా, వారు ఆగకుండా, స్టంట్లు చేస్తూ అక్కడి నుంచి జారుకున్నారు.
కొద్దిసేపటికే కటకటాల్లోకి: అయితే, వారి ఆట ఎంతోసేపు సాగలేదు. వేరొక ప్రాంతంలో ఆ యువకులను గుర్తించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని, బైక్‌ను సీజ్ చేశారు.
వీడియోతో సున్నిత హెచ్చరిక : ఈ ఘటనను కేరళ పోలీసులు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి ఓ అవకాశంగా మలుచుకున్నారు. యువకులు స్టంట్లు చేసినప్పటి నుంచి, వారిని పట్టుకుని, వారికి బుద్ధి చెప్పినంత వరకు మొత్తం వీడియో తీసి, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు. వీఐపీ ప్రోటోకాల్, రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే, ఇలాంటి కఠిన చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. ఈ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ, ఆకతాయిలకు తగిన శాస్తి జరిగిందని కామెంట్లు పెడుతున్నారు.
కుంగిన హెలిప్యాడ్.. రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం : ఇదిలా ఉండగా, రాష్ట్రపతి కేరళ పర్యటనలో మరో భద్రతా లోపం కూడా వెలుగుచూసింది. బుధవారం శబరిమల దర్శనానికి వెళ్లిన ఆమె, ప్రమదం గ్రామంలో కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్‌లో దిగారు. అయితే, హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా, ఆ హెలిప్యాడ్ కాస్తా కుంగిపోయింది. ఆమె దిగిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడంతో, పెను ప్రమాదం తప్పింది. చివరి క్షణంలో హెలిప్యాడ్ నిర్మించడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.


