Karnataka CM: కర్ణాటక రాజకీయాల్లో సమూలమైన మార్పులు రాబోతున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి త్వరలోనే మారబోతోందన్న ఊహాగానాలు కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ త్వరలో రాష్ట్ర పాలన బాధ్యతలు చేపట్టనున్నారన్న ప్రచారం మరింత బలపడుతోంది. దీనిపై కొందరు కర్ణాటక నేతలు, మంత్రులు కూడా స్పందించడంతో సీఎం మార్పు ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పుపై వచ్చిన ప్రశ్నకు స్పందిస్తూ, ‘‘ఈ విషయంలో నిర్ణయం పూర్తిగా పార్టీ హైకమాండ్ పరిధిలో ఉంది. హైకమాండ్ ఏం నిర్ణయిస్తుందో ఎవరూ ముందుగా ఊహించలేరు, అటువంటిది బయటకు వెల్లడించదగిన విషయం కాదు,’’ అని ఖర్గే స్పష్టం చేశారు. అలానే, పార్టీలో అంతర్గతంగా జరిగే అంశాలపై అనవసరమైన చర్చలు, అర్ధనార్థాలు సృష్టించకూడదని ఆయన సూచించారు. ఖర్గే ఈ వ్యాఖ్యలతో సీఎం మార్పు ఖాయంగా జరగనుందనే వాదనలు బలమయ్యాయి. ఖర్గే వ్యాఖ్యలు సీఎం మార్పుకు సంకేతమని చెబుతున్నారు.
మరోవైపు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని స్వీకరించబోతున్నారన్న వార్తలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యలు మరింత ఊపునిచ్చాయి. ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ‘‘రెండు మూడు నెలల్లో శివకుమార్ సీఎం కావచ్చనే చర్చ హైకమాండ్‌లో జరుగుతోంది. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు డీకే శివకుమార్ చేసిన కృషి అందరికీ తెలిసిందే,’’ అని అన్నారు. శివకుమార్‌కి అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడే హుస్సేన్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం శివకుమార్ భవిష్యత్తు పాత్రపై కీలక నిర్ణయం తీసుకునే దశకు చేరిందని భావిస్తున్నారు.
తుదినిర్ణయం హైకమాండ్‌కే
ప్రస్తుతం బసవరాజ్ బొమ్మై తర్వాత సీఎం పదవి చేపట్టిన సిద్ధరామయ్యకి పూర్తి మద్దతుగా పార్టీ ఉన్నప్పటికీ, అంతర్గతంగా వ్యవహారాలు దోహదపడే విధంగా మార్పులు జరగవచ్చన్న సంకేతాలు వెలుగుచూస్తున్నాయి. కానీ ఖర్గే చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఏదైనా అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ సీఎం మార్పు ఊహాగానాలకే పరిమితమవుతుందని స్పష్టమవుతోంది.