HomeTop StoriesKharge : స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లిన ఒక్క ఆర్‌ఎస్‌ఎస్ నేత ఉన్నారా? ఖర్గే సంచలన...

Kharge : స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లిన ఒక్క ఆర్‌ఎస్‌ఎస్ నేత ఉన్నారా? ఖర్గే సంచలన వ్యాఖ్యలు

Mallikarjun Kharge attack on BJP RSS freedom struggle : దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో రక్తమోడ్చింది ఎవరు? బ్రిటీష్ పాలకుల తుపాకీ గుళ్లకు గుండెలను ఎదురొడ్డి, జైలు గోడల మధ్య “భారత్ మాతా కీ జై” అంటూ నినదించిన త్యాగధనులు ఎవరు? నిజమైన దేశభక్తికి నిర్వచనం కాంగ్రెస్ త్యాగాల చరిత్రేనా? మరి స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఎక్కడా కనిపించని వారు నేడు అధికార పీఠాలపై కూర్చొని దేశభక్తి పాఠాలు చెప్పడం వెనుక ఉన్న అర్హత ఏంటి? శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఉందా? ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంధించిన ఈ పదునైన ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఖర్గే చేసిన విమర్శల వెనుక దాగున్న చారిత్రక కోణాలేంటి? ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ పాత్రపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలేమిటి?

- Advertisement -

జైలుకెళ్లిన ఆర్‌ఎస్‌ఎస్ నేత ఒక్కరైనా ఉన్నారా?: ఖర్గే సవాలు : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల భావజాలంపై విరుచుకుపడ్డారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ రెండు సంస్థల పాత్ర శూన్యమని ఆయన కుండబద్దలు కొట్టారు.

“దేశ విముక్తి కోసం జైలు పాలైన ఒక్క ఆర్‌ఎస్‌ఎస్ లేదా బీజేపీ నాయకుడైనా ఉన్నారా? వారి చరిత్ర పుటల్లో అటువంటి త్యాగం ఒక్కటైనా ఉందా? ఒకవేళ ఎవరైనా జైలుకు వెళ్లి ఉంటే.. వారు తొలుత కాంగ్రెస్‌లో ఉండి, ఆ తర్వాత అటువైపు వెళ్లిపోయిన వారే తప్ప అసలైన సంఘ్ పరివార్ నేతలు కారు.”
— మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

స్వాతంత్య్ర ఉద్యమంలో ఏనాడూ భాగస్వామ్యం లేని నాయకులు, నేడు కాంగ్రెస్‌కు ‘దేశభక్తి పాఠాలు’, శ్రీరంగనీతులు చెప్పడం శోచనీయమని ఈసడించుకున్నారు. కాంగ్రెస్ నాయకులే నిజమైన దేశభక్తులని, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన చారిత్రాత్మక ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ఈ సందర్భంగా ఖర్గే గుర్తుచేశారు. “చేయండి లేదా చావండి” (Do or Die) అనే నినాదం దేశ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిందని, అలాంటి పవిత్రమైన రోజున కాంగ్రెస్ తన పోరాట పటిమను చాటుతోందని పేర్కొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ భగీరథ ప్రయత్నం : ప్రజాసమస్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగిస్తున్న పోరాటాన్ని ఖర్గే ఆకాశానికెత్తేశారు. వీధి వీధినా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు రాహుల్ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.

భారత్ జోడో యాత్ర: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ కృషి చేశారని గుర్తుచేశారు.

ప్రజా క్షేత్రంలో నిరంతరం: రైతులు, యువత, విద్యార్థులు, పేదల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ పార్లమెంటు నుంచి రచ్చబండ వరకు రాహుల్ గళమెత్తుతున్నారని కొనియాడారు. బీజేపీలో ప్రజల వద్దకు వెళ్లి, వారి కష్టసుఖాలు వినే నాయకుడు ఒక్కరైనా ఉన్నారా అని ఖర్గే నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News