Creative City Of Gastronomy: ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోని సందర్శించేందుకు గతంలో కంటే ఎక్కువగా దేశవిదేశీ పర్యాటకులు ఎదురుచూస్తున్నారు. కారణం.. లక్నో యునెస్కో గుర్తింపు పొందడమే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70 గ్యాస్ట్రోనమీ నగరాల్లో ఈ మహానగరం చోటు దక్కించుకోవడమే. ‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’గా లక్నోకి టైటిల్ దక్కింది. అసలు ఈ ‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’ అంటే ఏమిటి.? ఏమిటి ఈ టైటిల్ ప్రత్యేకత.. ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read: https://teluguprabha.net/national-news/creative-city-of-gastronomy-lucknow-after-hyderabad/
ప్రతి మనిషికి జిహ్వ చాపల్యం ఉంటుంది. జిహ్వకో రుచి అన్నట్లుగా ఆకలి టైం అయ్యేసరికి మన కడుపు సంగతి పక్కనపెడితే నాలుక వివిధ రకాల రుచులను కోరుకుంటుంది. కొంతమంది దేశీ రుచులను ఎక్కువగా ఇష్టపడితే.. మరికొంతమంది విదేశీ వంటకాలను అమితంగా ఆస్వాదిస్తారు. ప్రత్యేకంగా ఫుడ్ కోసమే నగరాలు, దేశాలను చుట్టేసిన వాళ్లున్నారు. ఇక వంటకాల్లో కూడా ఒక్కో ప్రాంతానికి కూడా ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. పాక శాస్త్రంలో పెట్టింది పేరు అన్నట్లుగా ఆయా నగరాలు ప్రసిద్ధి చెందుతాయి. అలాంటి వాటిని గుర్తించి టైటిల్ అందించడమే యునెస్కో విధుల్లో ఒకటి. అలా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 70 నగరాలు క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీలో చోటుదక్కించుకున్నాయి. 2019లో భారత్ నుంచి హైదరాబాద్ నగరం ఈ టైటిల్ గెలుచుకోగా.. ఈ ఏడాది ఈ లిస్ట్‌లో యూపీ రాజధాని లక్నో చేరింది. దీంతో ఈ టైటిల్ గొప్పతనం ఏంటి అని నెటిజన్లు తెగ గూగుల్ చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/nitish-kumar-bihar-elections-video-message/
క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్(UCCN) లో భాగంగా యునెస్కో.. నగరాలకు ఇచ్చే ఒక ప్రత్యేకమైన హోదా క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ(Creative City of Gastronomy). ఆయా నగరాల్లోని ప్రత్యేకమైన, శతాబ్దాల నాటి వంటకాల వారసత్వాన్ని, జీవన ఆహార సంప్రదాయాలను, వంటల్లో సృజనాత్మకతను, పట్టణ అభివృద్ధిలో వాటి భాగస్వామ్యాన్ని గుర్తించి ఈ టైటిల్ అందిస్తారు. తాజాగా లక్నోకి ఈ టైటిల్ దక్కడంతో ఈ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ అవధి వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
ఈ టైటిల్ ద్వారా లక్నో పాక సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభిస్తుంది. గ్యాస్ట్రోనమీ నగరాల మధ్య అంతర్జాతీయ సహకారానికి అవకాశాలు పెరుగుతాయి. పాక పర్యాటకానికి పర్యాటకులు పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అంతే కాకుండా నగరానికి చెందిన గొప్ప వంటకాలను సంరక్షించడం, నమోదు చేయడం వంటి వాటికి ప్రోత్సాహం లభిస్తుంది.


