Kullu Dussehra unique tradition : దేవుడు, పోలీస్ స్టేషన్.. ఈ రెండింటికీ అస్సలు సంబంధం లేదు. ఒకటి భక్తికి, విశ్వాసానికి కేంద్రమైతే, మరొకటి చట్టానికి, న్యాయానికి ప్రతీక. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో మాత్రం ఈ రెండూ ఒకచోట కలుస్తాయి. అక్కడ ఏకంగా దేవుడే పోలీస్ స్టేషన్‌కు అతిథిగా వెళ్తాడు. తాను వస్తున్నానని ముందురోజే సమాచారం ఇచ్చి, ఆవరణను శుభ్రం చేయమని ఆదేశిస్తాడు. అసలు దైవం ఠాణాకు ఎందుకు వెళ్తుంది..? భక్తుడి కోసం దేవుడు చేసిన ఆ అద్భుతం ఏంటి..? వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వింత ఆచారం వెనుక ఉన్న కథేంటి..?
హిమాచల్ ప్రదేశ్‌లో అంతర్జాతీయ కులూ దసరా వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయదశమి రోజున మొదలయ్యే ఈ ఉత్సవాలకు వందలాది దేవతలు తరలివచ్చి ధల్పూర్ మైదానంలో కొలువుదీరుతారు. అయితే, ఈ ఉత్సవాల్లో అందరి దృష్టినీ ఆకర్షించేది దేవుడు అజయ్ పాల్ మహత్యమే. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ, అజయ్ పాల్ దేవుడు శనివారం (అక్టోబర్ 4) తన భక్తులతో కలిసి ధాల్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి చేరుకుని అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. విశేషమేమిటంటే, తన రాక గురించి దేవుడు ముందురోజే స్టేషన్ ఇన్‌చార్జికి తెలియజేసి, ప్రాంగణాన్ని శుభ్రం చేయమని ఆదేశించడం. దైవాజ్ఞను శిరసావహించిన పోలీసులు, స్టేషన్ ఆవరణను శుభ్రపరిచి స్వాగతం పలికారు.
వందేళ్ల నాటి అద్భుతం : ఈ వింత ఆచారం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉందని ఆలయ పూజారి నూప్ రామ్ వివరించారు. ఆయన కథనం ప్రకారం.
“బ్రిటిష్ పాలనలో ఖంపూ అనే అజయ్ పాల్ భక్తుడు ఒకడు ఉండేవాడు. అతను ఒకరికి బెయిల్ ఇవ్వగా, ఆ వ్యక్తి విచారణకు హాజరుకాకుండా పారిపోయాడు. దీంతో పోలీసులు ఖంపూను అరెస్టు చేసి, చేతులకు సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో ఖంపూ ఒక చేతి సంకెళ్లు వాటంతట అవే తెగిపోయాయి. ఈ అనూహ్య పరిణామంతో పోలీసులు నివ్వెరపోయారు. కులూ పోలీస్ స్టేషన్‌కు చేరుకునేసరికి, రెండో చేతి సంకెళ్లు కూడా తెగిపోయాయి.”
ఈ అద్భుతాన్ని చూసిన పోలీసులు, “నిన్ను ఎవరు అనుసరిస్తున్నారు?” అని ఖంపూను ప్రశ్నించారు. అందుకు అతను, “నా వెనుక ఎవరూ లేరు,” అని సమాధానమిచ్చాడు. కానీ, పోలీసులకు మాత్రం ఖంపూ వెనుక నడుస్తున్న ఓ దివ్యమూర్తి కనిపించింది. ఆయనే అజయ్ పాల్ దేవుడు. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన అని భక్తులు బలంగా నమ్ముతారు.
విస్తుపోయిన పోలీసులు : ఖంపూ చేతి సంకెళ్లు వాటంతట అవే తెగిపోవడాన్ని దైవ మహత్యంగా భావించిన పోలీసులు, అతడిని గౌరవంగా విడుదల చేశారు. ఆ తర్వాత, పోలీసులు అజయ్ పాల్ శక్తిని, అద్భుతాన్ని అంగీకరించారు. తన భక్తుడైన ఖంపూ కోసం ఆనాడు దేవుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి, అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సంఘటనకు ప్రతీకగా, ఏటా దసరా ఉత్సవాల సమయంలో అజయ్ పాల్ దేవుడు కులూ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడ విశ్రాంతి తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.
కరువు తీర్చిన దైవం : అజయ్ పాల్‌ను స్థానికులు విష్ణువు అవతారంగా కొలుస్తారు. కరువు కాటకాల నుంచి తమను గట్టెక్కించే దేవుడని బలంగా విశ్వసిస్తారు. ఒకప్పుడు కాంగ్రా జిల్లాలోని బీర్ భంగల్ నుంచి కులూకు వచ్చిన అజయ్ పాల్, బగన్ అనే గ్రామంలో స్థిరపడ్డాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం తీవ్ర కరువుతో అల్లాడుతోంది. దేవుడు అడుగుపెట్టిన తర్వాత భారీ వర్షాలు కురిసి, పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, అప్పుడే అక్కడ ఆయనకు ఆలయం నిర్మించారని పూజారి తెలిపారు.


