Sunday, November 16, 2025
Homeనేషనల్Panna : కూలీ బతుకులో 'వజ్ర' కాంతులు.. రాత్రికిరాత్రే లక్షాధికారి!

Panna : కూలీ బతుకులో ‘వజ్ర’ కాంతులు.. రాత్రికిరాత్రే లక్షాధికారి!

Diamonds found in Panna mines : అతని పేరు హరగోవింద్ యాదవ్. ఓ నిరుపేద కూలీ. ఐదేళ్లుగా అతనూ, అతని భార్యా రాళ్లూరప్పల మధ్యే బతుకుతున్నారు. వారి కళ్లలో ఒకే ఒక ఆశ.. ఒకే ఒక్క కల.. ఒక్క వజ్రం దొరక్కపోదా, తమ బతుకులు మారకపోతాయా అని. చివరికి ఆ దేవుడు కరుణించాడు. వారి తలరాతను మార్చాలనుకున్నాడు. ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది వజ్రాలు వారి కంటపడ్డాయి. ఆ నిరుపేద కూలీ ఇప్పుడు లక్షాధికారి. ఇంతకీ, ఆ వజ్రాల గని ఎక్కడుంది..?

- Advertisement -

వజ్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మధ్యప్రదేశ్‌లోని పన్నా గనులు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. ఛతర్‌పుర్ జిల్లా కటియా గ్రామానికి చెందిన హరగోవింద్ యాదవ్, తన భార్య పవన్ దేవి యాదవ్‌తో కలిసి గత ఐదేళ్లుగా పన్నాలోని నిస్సార గనుల్లో కూలి పని చేసుకుంటున్నారు. రోజూ వజ్రాల కోసం గనులను తవ్వుతూనే ఉన్నారు. వారి ఓపికకు, పట్టుదలకు అదృష్టం తోడైంది. ఇటీవల వారికి ఏకంగా 8 వజ్రాలు లభించాయి. వాటిలో కొన్ని ముడి వజ్రాలు కాగా, మరికొన్ని అత్యంత స్వచ్ఛమైనవి.ఈ వజ్రాలను చూసిన అధికారులు వాటి విలువ సుమారు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ వార్త తెలియగానే హరగోవింద్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. రాత్రికిరాత్రే వారి జీవితం మారిపోయింది.


విలువ కట్టి, వేలం వేసి : నిబంధనల ప్రకారం, హరగోవింద్ తనకు దొరికిన వజ్రాలను పన్నాలోని వజ్రాల కార్యాలయంలో అప్పగించాడు. అక్కడ నిపుణులు ఆ వజ్రాల నాణ్యతను పరిశీలించి, వాటి క్యారెట్లను బట్టి కచ్చితమైన విలువను నిర్ధారిస్తారు. అనంతరం వాటిని అధికారికంగా వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన మొత్తం నుంచి ప్రభుత్వ పన్నులు, రాయల్టీ పోగా మిగిలిన డబ్బును హరగోవింద్ కుటుంబానికి అందజేస్తారు.

ఈ సందర్భంగా హరగోవింద్ యాదవ్ ఆనందం వ్యక్తం చేస్తూ, “ఐదేళ్లుగా నేనూ నా భార్య వజ్రాల కోసం కష్టపడుతూనే ఉన్నాం. ఈసారి ఆ భగవంతుడు మమ్మల్ని కరుణించాడు. ఒకేసారి ఎనిమిది వజ్రాలు దొరికాయి. వాటి విలువ రూ.10-12 లక్షలు ఉంటుందని అంటున్నారు. నిజానికి గతంలోనూ నాకు ఒక వజ్రం దొరికింది, కానీ అప్పుడు అవగాహన లేకపోవడంతో కేవలం లక్ష రూపాయలకే అమ్మేశాను. ఈసారి ఆ తప్పు చేయకుండా, అధికారులకే అప్పగించాను,” అని తెలిపారు.

పన్నా గనుల్లో ఇలా వజ్రాలు దొరకడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది (2024లో) చున్ వాదా గోండ్ అనే మరో కూలీకి ఏకంగా 19.22 క్యారెట్ల భారీ వజ్రం దొరికిన విషయం తెలిసిందే. దాని విలువ దాదాపు రూ.80 లక్షలు పలికింది. పన్నా గనులు ఇలా ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad