Director Rohit Shetty: బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున పలువురు జరిపిన కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అమన్ ఆనంద్ మరోట్, స్వప్నిల్ బంధు సాకేత్, సిద్ధార్థ్ దీపక్ ఐన్‌పురే, సమర్థ్ శివ్ శరణ్ పోమాజీ, ఆదిత్య జ్ణానేశ్వర్‌గా పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రే వారిని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వారికి ఫిబ్రవరి 5 వరకు పోలీస్ కస్టడీ విధించింది. అయితే ఈ కేసులు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే: రోహిత్ శెట్టిని భయపెట్టాలన్న ప్లాన్‌తో జుహులోని ఆయన ఇంటిపై ఐదుగురు నిందితులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులకు కుట్ర చేసింది.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన శుభం లంగ్‌కోర్, అర్జు బిష్ణోయ్, హరి బాక్సర్‌లు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్‌ను సైతం పెట్టారు. ఆ పోస్టులో.. “రోహిత్ శెట్టిని చాలా సార్లు హెచ్చరించాం. మా పనికి అడ్డం రావద్దని చెప్పాం అయినా అతనిలో మార్పు రాలేదు. అతడు మా మాటల్ని అస్సలు లెక్కచేయలేదు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఇప్పటికి అతడు అర్థం చేసుకోకపోతే.. ఈసారి బుల్లెట్లు ఇంటి గోడల మీద కాదు.. డైరెక్టుగా బెడ్రూంలో అతడి గుండెలపై పేలుస్తాం” అని అన్నారు.
Also read-Rohit Shetty: రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కలకలం.. అర్ధరాత్రి దుండగుల దాడి.!
బాబా సిద్ధిఖీ కేసులో లంగ్‌కోర్ నిందితుడు: కాగా, శుభం లంగ్‌కోర్.. బాబా సిద్ధిఖీ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ఉన్నాడు. శుభం చెప్పినందువల్లే సమర్థ్ శివ్ శరణ్ పోమాజీ.. రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు జరపడానికి పూనుకున్నాడని సమాచారం. మిగిలిన నిందితులతో కలిసి అతడు పక్కా ప్లాన్ వేశాడు. ప్రధాన షూటర్ అమన్ ఆనంద్ మరోట్ మరో నిందితుడితో కలిసి స్కూటర్‌పై రోహిత్ శెట్టి ఇంటి దగ్గరకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారు ఇంటి గోడపై నాలుగు రౌండ్లు కాల్పలు జరిపాడు. ఆ వెంటనే ఇద్దరూ అక్కడినుంచి పారిపోయారు. అయితే ఈ కేసును ఛాలంజ్‌గా తీసుకున్న పోలీసులు.. ఆదివారం సాయంత్రానికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

