Lawyer defends attack on CJI : దేశ న్యాయవ్యవస్థనే ఉలిక్కిపడేలా చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి ఘటనలో, నిందిత న్యాయవాది రాకేశ్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన పనికి ఏమాత్రం భయపడటం లేదని, పశ్చాత్తాపపడటం లేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఓ విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణ పిటిషన్‌పై సీజేఐ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలే తనను బాధించాయని, తన చర్యకు అవే కారణమని ఆయన పేర్కొన్నారు. అసలు ఆ రోజు కోర్టులో ఏం జరిగింది? రాకేశ్ కిశోర్ ఆగ్రహానికి దారితీసిన ఆ వ్యాఖ్యలేంటి? మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడిన న్యాయవాది రాకేశ్ కిశోర్, తన చర్యను సమర్థించుకుంటూ, పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“సెప్టెంబర్ 16న, మధ్యప్రదేశ్‌లోని విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణపై వేసిన పిటిషన్‌ను విచారిస్తూ, సీజేఐ ‘వెళ్లి మీ దేవుడినే ఏదైనా చేయమని అడగండి’ అని వ్యంగ్యంగా అన్నారు. అదే ఇతర మతాల కేసుల్లో సుప్రీంకోర్టు సానుకూలంగా ఉంటుంది. న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ మన నమ్మకాలను ఎగతాళి చేయకూడదు. ఆ వ్యాఖ్యలే నన్ను బాధించాయి. నేను హింసకు వ్యతిరేకిని, కానీ ఒక సాధారణ పౌరుడు ఎందుకిలా చేశాడో ఆలోచించాలి.” – రాకేశ్ కిశోర్, నిందిత న్యాయవాది తాను ఏ మత్తులోనూ లేనని, సీజేఐ చర్యకు ఇది కేవలం తన ప్రతిస్పందన మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. “దేవుడే నాతో ఈ పని చేయించాడు. జైలుకి వెళ్లాలన్నా, ఉరితీయాలన్నా అది ఆయన చిత్తం,” అని రాకేశ్ అన్నారు. ‘సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది’ సనాతన ధర్మానికి సంబంధించిన జల్లికట్టు, దహీహండి వంటి అంశాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు తమను బాధించాయని రాకేశ్ పేర్కొన్నారు. “వేల ఏళ్లుగా సహనం చూపించాం. కానీ ఇప్పుడు మా సనాతన గుర్తింపే ప్రమాదంలో ఉంది. ప్రజలు తమ హక్కుల కోసం ముందుకు రావాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.
బార్ కౌన్సిల్ సస్పెన్షన్‌పై అభ్యంతరం ఈ ఘటన తర్వాత, బార్ కౌన్సిల్ తనను సస్పెండ్ చేయడాన్ని రాకేశ్ కిశోర్ తప్పుబట్టారు. ఎలాంటి క్రమశిక్షణా కమిటీ వేయకుండా, తనకు నోటీసు ఇవ్వకుండా, ఏకపక్షంగా సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు. న్యాయవ్యవస్థపై దాడిగా ఖండన ఇదిలా ఉండగా, సీజేఐపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, సుప్రీంకోర్టు ఎదుట నిరసన చేపట్టింది. ఇది యావత్ న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన, దేశంలో న్యాయవ్యవస్థ భద్రత, న్యాయమూర్తులపై పెరుగుతున్న అసహనంపై తీవ్రమైన చర్చకు దారితీసింది.


