ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మెడికల్ కాలేజీలో జరిగిన ప్రమాదంలో నవజాతి శిశువుల మృతి ఘటనపై పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. తాజాగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా(Priyanaka Gandhi Vadra), సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) తమ సంతాపం తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. “ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మెడికల్ కాలేజీలో జరిగిన ప్రమాదంలో అమాయక పిల్లలు మరణించారనే వార్త చాలా బాధాకరం. మృతులు కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి” అని ఎక్స్ వేదికగా పోస్ట్‌లో పేర్కొన్నారు
ఇక కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా నవజాత శిశువుల మృతి పట్ల సంతాపం తెలిపారు. ”నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అగ్నిప్రమాదం కారణంగా పది మంది పిల్లలు మరణించారనే వార్త షాక్‌కు గురిచేసింది. ఈ మహా విషాద సమయంలో మృతుల కుటుంబాలు, తల్లిదండ్రులకు కాంగ్రెస్ పార్టీ తరుపున అండగా ఉంటాము” అని ఆమె పోస్ట్ చేశారు.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. “ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం కారణంగా 10 మంది పిల్లలు చనిపోవడం, చాలా మంది పిల్లలు గాయపడినట్లు వార్తలు రావడం చాలా బాధాకరం, ఆందోళన కలిగిస్తున్నాయి. అందరికీ హృదయపూర్వక సానుభూతి. అగ్నిప్రమాదానికి కారణం ‘ఆక్సిజన్ కాన్సంట్రేటర్’లో మంటలు. ఇది మెడికల్ మేనేజ్‌మెంట్ & అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కేసులో బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంతా బాగానే ఉంది అన్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారాన్ని వదిలేసి వైద్య సౌకర్యాలపై దృష్టి పెట్టాలి” అని డిమాండ్ చేశారు.