Supreme Court Let Wife Remain MLA: సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నాయకుడు ఇర్ఫాన్ సోలంకీకి సుప్రీంకోర్టులో ఊహించని వ్యాఖ్య ఎదురైంది. తనపై నమోదైన క్రిమినల్ కేసులో శిక్షపై స్టే కోరుతూ ఇర్ఫాన్ సోలంకీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మీ భార్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాపం ఆమెను ఎమ్మెల్యేగా కొనసాగనివ్వండి. రాబోయే రెండేళ్లలో ఎన్నికలు జరగవు కదా?” అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ALSO READ: Tax evasion: లగ్జరీ కార్ల పన్ను ఎగవేత.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై దాడులు
యూపీలోని సిసమౌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇర్ఫాన్ సోలంకీ ఒక మహిళ ఇంటికి నిప్పుపెట్టిన కేసులో దోషిగా నిర్ధారించబడ్డారు. గత సంవత్సరం జూన్‌లో కాన్పూర్ నగర్ సెషన్స్ కోర్టు ఆయనకు శిక్ష విధించింది. ఈ తీర్పుతో ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆయన భార్య నసీమ్ సోలంకీ పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఇర్ఫాన్ సోలంకీ తన శిక్షపై స్టే కోసం అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అది తిరస్కరించబడింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్. కోటీశ్వర సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. “మీ అనర్హత కారణంగానే మీ భార్య ఎన్నికయ్యారు. ఇప్పుడు మీ శిక్షపై స్టే కోసం పిటిషన్ దాఖలు చేసి, ఆమె ఎమ్మెల్యే పదవికి అడ్డంకులు సృష్టించడం ఎందుకు?” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే, ఈ కేసును అలహాబాద్ హైకోర్టులోనే ఆరు నెలల్లోగా విచారించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు సూచించింది. ఇర్ఫాన్ సోలంకీ తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు, కోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో ఇర్ఫాన్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. తన శిక్ష వల్ల దాదాపు 2,70,000 మంది ఓటర్లకు అన్యాయం జరుగుతోందని, భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కోల్పోతున్నానని సోలంకీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ALSO READ: Nepo Kids: మనీశ్ ‘నెపో కిడ్స్’ ట్వీట్‌పై బీజేపీ విమర్శ.. ‘కొంచెం ఎదగండి’ అని కాంగ్రెస్ కౌంటర్


