Saturday, November 15, 2025
HomeTop StoriesLIC: మాపై ఎవరి ఒత్తిళ్లూ లేవు.. అదానీలో పెట్టుబడి మా స్వతంత్ర నిర్ణయం.. ఎల్‌ఐసీ క్లారిటీ

LIC: మాపై ఎవరి ఒత్తిళ్లూ లేవు.. అదానీలో పెట్టుబడి మా స్వతంత్ర నిర్ణయం.. ఎల్‌ఐసీ క్లారిటీ

LIC Clarifies on Adani group investments: తమది స్వతంత్ర సంస్థ అని, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగబోమని ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులపై వస్తోన్న విమర్శలపై క్లారిటీ ఇచ్చింది. పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల వెనుక ప్రభుత్వ హస్తం ఉందంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎల్‌ఐసీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్‌లో శనివారం ఓ పోస్ట్‌ పెట్టింది. మరోవైపు, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సైతం ఇదే రకమైన విమర్శలు చేస్తోంది. ఖాతాదారుల సొమ్మును అప్పనంగా అదానీకి కట్టబెడుతున్నారనే ఆరోపణలు చేస్తోంది. దీంతో, ఈ ఆరోపణలపై ఎల్‌ఐసీ క్లారిటీ ఇచ్చింది. ఓవైపు అప్పులు, మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వేళ ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిందంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ తాజాగా ఓ కథనం వెలువరించడం సంచలనంగా మారింది. ప్రభుత్వ అధికారుల నుంచి ప్రణాళిక మేరకే ఎల్‌ఐసీ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిందంటూ ఆరోపించింది. దీనిపై తాజాగా ఎల్‌ఐసీ స్పందిస్తూ.. ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. పెట్టుబడులపై తమదే తుది నిర్ణయమని పేర్కొంది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇతర శాఖల ప్రమేయం గానీ లేదని స్పష్టం చేసింది. ఎల్‌ఐసీ బోర్డు ఆమోదించిన విధానాలనను అనుసరించి పెట్టుబడులపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని ఎల్‌ఐసీ పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రమాణాలు ఎల్‌ఐసీ పాటిస్తూ వస్తోందని, అలాంటి సంస్థపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని వార్తాపత్రికలు, పార్టీలకు హితవు పలికింది.

- Advertisement -

టాప్‌ 500 కంపెనీల్లో భారీ పెట్టుబడులు..

ఎల్‌ఐసీకి దేశంలోని టాప్‌ 500 కంపెనీల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. 2014లో ఈ మొత్తం రూ.1.56 లక్షల కోట్లు ఉండగా.. ఈ మొత్తం రూ.15.6 లక్షల కోట్లకు పెరిగింది. అంటే గడిచిన పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. ఒక్క అదానీనే కాదు రిలయన్స్‌, ఐటీసీ, టాటా గ్రూపు కంపెనీల్లోనూ ఎల్‌ఐసీకి పెద్ద మొత్తంలో వాటాలు ఉన్నాయి. అదానీ గ్రూపులో 4 శాతం వాటా (రూ.60 వేల కోట్ల పెట్టుబడి) ఉండగా.. రిలయన్స్‌లో 6.94 శాతం వాటా (రూ.1.34 లక్షల కోట్లు), ఐటీసీలో 15.86 శాతం (రూ.82,800 కోట్లు); హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 4.89 శాతం (రూ.64,725 కోట్లు); ఎస్‌బీఐలో 9.50 శాతం (రూ.79,361 కోట్లు) పెట్టుబడులు ఉన్నాయి. టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఒక్క టీసీఎస్‌లోనే 5.02 శాతానికి సమానమైన రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు ఎల్‌ఐసీకి ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad