Liquor Scam Case: ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌కు అక్కడి ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. జులై 18తో చైతన్య ఈడీ కస్టడీ ముగియగా, ఆయనను అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఈడీ తరపు న్యాయవాది మాట్లాడుతూ, చైతన్యను విచారించామని, వాదనలు, డాక్యుమెంట్ల ఆధారంగా ప్రశ్నించామని తెలిపారు. అనేక పాయింట్ల వద్ద ఆయన అంగీకరించారని, దీంతో జ్యుడీషియల్ కస్టడీ కోరినట్లు తెలిపారు. ఆగస్టు 4 వరకు చైతన్య జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
మద్యం కుంభకోణంలో రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ ఆదాయ నిర్వహణలో చైతన్యకు ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించింది. అందులో రూ. 16.7 కోట్లను చైతన్య తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఉపయోగించారని పేర్కొంది.
దృష్టి మరల్చడానికి అక్రమ కేసులు..
ఈ వ్యవహారంపై మాజీ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. కేంద్ర ఏజెన్సీలను ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు గనుల కోసం అక్రమంగా చెట్లను నేలకూల్చుతున్నారని, దాని నుంచి దృష్టి మరల్చడానికి ఈడీ తన కుమారుడిపై చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
2019 – 2022 మధ్య భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టాన్ని కలిగిందని, మద్యం సిండికేట్‌కు రూ. 2,100 కోట్లకు పైగా దక్కిందని ఈడీ పేర్కొంది. ఈ కేసులో మాజీ మంత్రి కవాసి లఖ్మా, మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ ట్యుటేజాతో సహా పలువురిని అరెస్టు చేశారు. అక్రమ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన కమీషన్‌ను “రాష్ట్రంలోని అత్యున్నత రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు” పంచుకున్నారని కూడా ఈడీ తెలిపింది.


