ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హింస, అదానీ వివాదంపై ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ (Lok Sabha) శుక్రవారం కూడా వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేయవలసి వచ్చింది.
లోక్‌సభ (Lok Sabha) తిరిగి ప్రారంభం కాగానే విపక్షాల నిరసనలు కొనసాగాయి. కొంతమంది ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ పేపర్లు విసిరి నిరసన తెలిపారు. దీంతో సభకు అధ్యక్షత వహించిన దిలీప్ సైకియా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. ఆయన అప్పీలు విఫలమవడంతో స్పీకర్ సభను ఒక్కరోజుకి వాయిదా వేశారు. రేపు, ఎల్లుండి.. శని, ఆదివారాలు కావడంతో తిరిగి సోమవారం ఉదయం సభ సమావేశం కానుంది.