Online Gaming Bill 2025 passed : ఆన్‌లైన్ గేమింగ్ ముసుగులో యువతను వ్యసనపరులుగా మార్చి, కుటుంబాలను ఛిద్రం చేస్తున్న బెట్టింగ్ యాప్‌ల భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది. దేశంలో డబ్బుతో ఆడే అన్ని రకాల ఆన్‌లైన్ ఆటలను నిషేధిస్తూ, నిర్వాహకులు, ప్రచారకర్తలకు కఠిన శిక్షలు విధించే “ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025″కు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.విపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్లు, రాజ్యసభలోనూ నెగ్గి చట్టరూపం దాలిస్తే ఆన్‌లైన్ బెట్టింగ్ ఇకపై తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇంతకీ ఈ బిల్లులోని కఠిన నిబంధనలు ఏమిటి..? ఎవరికి శిక్ష పడుతుంది..?
మూడేళ్ల కఠోర పరిశోధన ఫలితం : విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆన్‌లైన్ గేమింగ్‌లో సమాజానికి మేలు చేసే ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమింగ్ వంటివి ఉన్నాయని, అయితే డబ్బుతో కూడిన మూడో విభాగం వల్ల సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని” అన్నారు. ఈ వ్యసనం కారణంగా ఎందరో యువకులు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మూడేళ్ల పాటు గేమింగ్ పరిశ్రమతో సహా అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చించి, మంచిని ప్రోత్సహిస్తూ, చెడును అణిచివేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించామని స్పష్టం చేశారు.
బిల్లులోని శిక్షలు – జరిమానాలు ఇవే : ఈ కొత్త చట్టం ప్రకారం, ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
నిర్వాహకులకు: డబ్బుతో కూడిన ఆన్‌లైన్ గేమ్స్ నిర్వహించేవారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.
ప్రచారకర్తలకు: ఈ గేమ్‌లకు సంబంధించిన ప్రకటనలలో నటించినా, వాటిని ప్రచారం చేసినా రెండేళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
ఆర్థిక సంస్థలకు: బెట్టింగ్ యాప్‌లకు నిధులు సమకూర్చినా, సహకరించినా మూడేళ్ల వరకు జైలు, కోటి రూపాయల వరకు జరిమానా తప్పదు.
ఆటగాళ్లకు ఊరట: అయితే, ఈ బిల్లులో కీలకమైన అంశం ఏమిటంటే.. ఆన్‌లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా పరిగణిస్తారు. వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. శిక్షలు కేవలం నిర్వాహకులు, ప్రచారకర్తలకు మాత్రమే వర్తిస్తాయి.
యాడ్స్‌పై సంపూర్ణ నిషేధం : ఈ బిల్లు ఆన్‌లైన్ మనీ గేమ్‌లకు సంబంధించిన అన్ని రకాల ప్రకటనలను పూర్తిగా నిషేధిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇలాంటి గేమ్‌లకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశిస్తుంది. ఈ నిబంధనల ద్వారా బెట్టింగ్ యాప్‌ల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజ్యసభ ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారితే, దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ శకానికి తెరపడినట్లే. ఇది యువత భవిష్యత్తును కాపాడటంతో పాటు, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలకు కూడా అడ్డుకట్ట వేస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.


