వక్ఫ్ సవరణ బిల్లుకు(Waqf Bill) లోక్‌సభలో ఆమోదం లభించింది. బుధవారం బిల్లుపై దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడీగా చర్చ జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం కోసం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేయగా.. 232 మంది సభ్యులు వ్యతిరేకించారు. ఇవాళ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ఇక ఈ బిల్లుపై చర్చ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారు. దక్షిణాఫ్రికా చట్టాల గురించి గాంధీ మాట్లాడుతూ.. తన మనస్సాక్షి దీన్ని అంగీకరించదంటూ ఆ కాపీలను చింపేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తాను కూడా ఈ బిల్లును చింపేస్తున్నానని చించేశారు. దేశంలో బీజేపీ విభజన సృష్టించాలని కోరుకుంటోందని ఆరోపించారు. దేవాలయాలు, మసీదుల పేరుతో విభజనను సృష్టించడం మంచి పద్ధతి కాదన్నారు.