Lok Sabha : పార్లమెంట్ లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు కీలక బిల్లులు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, యూనియన్ టెరిటరీస్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
ALSO READ: Medaram Jatara: మహా జాతరకు నిర్వహణకు రూ. 150 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ప్రధాని, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తీవ్ర నేర ఆరోపణలతో 30 రోజుల పాటు జైలులో ఉంటే వారి పదవులు రద్దు చేసేలా చట్టం తీసుకొచ్చారు. ఈ బిల్లులు రాజకీయ దుర్వినియోగానికి దారితీస్తాయని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, గుజరాత్ హోం మంత్రిగా అమిత్ షా అరెస్ట్ అయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ విమర్శించగా, షా తాను నైతిక బాధ్యతగా రాజీనామా చేశానని సమాధానమిచ్చారు. విపక్ష ఎంపీలు బిల్లు కాపీలను చించివేసి, సభలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు, దీంతో సభ 3 గంటలకు వాయిదా పడింది.
అదే సమయంలో, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించి, ఈ-స్పోర్ట్స్‌తో వేరుచేస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ.1 కోటి జరిమానా విధించేలా చట్టం ప్రతిపాదిస్తోంది. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఈ బిల్లు పరిశ్రమకు నష్టం కలిగిస్తుందని అమిత్ షాకు లేఖ రాసింది. విపక్షాల నిరసనల మధ్య సభలో గందరగోళం నెలకొనడంతో చర్చలు సాగలేదు. ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.


