DK Shivakumar Slams Goa Chief Minister: కర్ణాటక, గోవా మధ్య మహదాయి నదీ జలాల పంపిణీ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ అంశంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సావంత్‌కి మతిపోయిందంటూ శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదీ జరిగింది..
మహదాయి ప్రాజెక్టును కర్ణాటక ఏకపక్షంగా కొనసాగిస్తే, గోవా అసెంబ్లీని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని, ప్రాజెక్టు ఎలా ముందుకు వెళ్తుందో చూస్తామని అన్నారు. సావంత్ ప్రకటనపై డీకే శివకుమార్ నిప్పులు చెరిగారు. “గోవా ముఖ్యమంత్రి మానసిక సమతుల్యం కోల్పోయినట్లున్నారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే, ప్రజల సమస్యలపై ఆయనకు ఎంతమాత్రం పట్టింపు లేదని అర్థమవుతోంది” అని శివకుమార్ అన్నారు. గోవా ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
మహదాయి నదీ జలాల పంపిణీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఆ ఆదేశాలకు కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తుందని శివకుమార్ స్పష్టం చేశారు. కర్ణాటక తన వాటా నీటిని వినియోగించుకునే హక్కు ఉందని, ఈ ప్రాజెక్టును కొనసాగించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. “మా రైతుల ప్రయోజనాలను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నాం. దీనిపై ఎలాంటి వెనుకడుగు వేయం” అని శివకుమార్ అన్నారు.


