Sunday, February 8, 2026
Homeనేషనల్Marriage : మంగళ సూత్రం.. ముచ్చటైన ముహూర్తం.. ఖర్చు కేవలం ముప్పై ఒక్క వేల రూపాయిలే!

Marriage : మంగళ సూత్రం.. ముచ్చటైన ముహూర్తం.. ఖర్చు కేవలం ముప్పై ఒక్క వేల రూపాయిలే!

Low cost wedding scheme India : నేటి కాలంలో పెళ్లి అంటేనే ఒక ‘కత్తిమీద సాము’. భాజాభజంత్రీలు, విందు వినోదాలు, అలంకరణల పేరుతో లక్షలాది రూపాయలు తగలేస్తే తప్ప సమాజంలో గౌరవం దక్కదనే భ్రమలో చాలా కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇలాంటి తరుణంలో, గుజరాత్‌లోని ఒక సామాజిక వర్గం తీసుకున్న వినూత్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కేవలం రూ.31,000 ఖర్చుతో, అది కూడా మీరు కోరుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించే ‘డైలీ మ్యారేజ్ స్కీమ్’  వెలుగులోకి వచ్చింది. 

- Advertisement -

వినూత్న ఆలోచన: సామూహిక వివాహాలకు స్వస్తి.. ‘డైలీ స్కీమ్’కు శ్రీకారం : సాధారణంగా ఆర్థిక భార తగ్గించుకోవడానికి చాలామంది ‘సామూహిక వివాహాల’ను ఎంచుకుంటారు. అయితే ఇందులో ప్రధాన సమస్య పెళ్లి తేదీ. సమాజం నిర్ణయించిన రోజున మాత్రమే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గుజరాత్‌లోని మెహసాణా జిల్లాకు చెందిన ‘పటన్వాడా గజ్జర్ సుతార్ సమాజం’ ఈ సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించింది.

పథకం పనితీరు – అంచెలంచెలుగా:
నచ్చిన ముహూర్తం – మెచ్చిన రోజు: జ్యోతిష్యులు నిర్ణయించిన ఏ శుభ ముహూర్తానికైనా ఈ పథకం కింద పెళ్లి చేసుకోవచ్చు. దీనివల్ల నెలల తరబడి నిరీక్షణ తప్పుతుంది.  పెళ్లి చేసుకునే కుటుంబం సమాజానికి కేవలం రూ.31,000 విరాళంగా ఇస్తే సరిపోతుంది. భోజనం, వసతి, ఫంక్షన్ హాల్ అలంకరణ వంటి ఖర్చులన్నింటినీ సమాజమే భరిస్తుంది. సామూహిక వివాహాల్లో ఉండే రద్దీ, గందరగోళం ఇక్కడ ఉండవు. ఒకే రోజు ఒకటి లేదా రెండు జంటలకు మాత్రమే వివాహం జరగడం వల్ల ‘ప్రైవేట్ వెడ్డింగ్’ అనుభూతి కలుగుతుంది.

ఖర్చులో 90 శాతం ఆదా : సమాజ అధ్యక్షుడు దినేశ్‌ భాయ్ సుతార్ లెక్కల ప్రకారం.. గత ఏడాది ఆరు జంటలకు నిర్వహించిన గ్రూప్ వెడ్డింగ్‌కు రూ.20 లక్షల ఖర్చయింది. అదే ఈ ‘డైలీ స్కీమ్’ ద్వారా ఆరు వివాహాలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తే కేవలం రూ.2 లక్షల లోపే పూర్తవుతుంది. అంటే ఖర్చులో దాదాపు 90 శాతం ఆదా అవుతోంది. ఈ మిగిలిన మొత్తాన్ని సమాజ సంక్షేమ కార్యక్రమాలకు వాడుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఎన్నారైలు, ఉద్యోగులకు వరం : ఈ పథకం ముఖ్యంగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగులకు వరంగా మారింది. తక్కువ సెలవులపై స్వదేశానికి వచ్చే వారికి, సమాజం నిర్ణయించే సామూహిక వివాహ తేదీలతో పనిలేకుండా, వారు ఉన్న సమయంలోనే తక్కువ ఖర్చుతో పెళ్లి తంతు ముగించుకోవడానికి ఇది చక్కని మార్గంగా నిలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎన్నారై యువకులు ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవడం దీని విజయానికి నిదర్శనం.

సమాజ మార్పుకు ఇదో నాంది : ఆడంబరాలకు పోయి అప్పుల పాలయ్యే కంటే, ఇలాంటి పొదుపు మంత్రం పాటించడం మేలని మెహసాణా సుతార్ సమాజం నిరూపిస్తోంది. “ఖర్చు కాదు.. ఆత్మీయత ముఖ్యం” అని చాటిచెబుతున్న ఈ ‘డైలీ మ్యారేజ్ స్కీమ్’ అన్ని సామాజిక వర్గాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆడంబరాల పెళ్లిళ్లకు చెక్ పెడుతూ, మధ్యతరగతి ఇళ్లలో మంగళ వాయిద్యాలు మోగించే ఈ వినూత్న ప్రయోగం నిజంగా అభినందనీయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News