Liquor smuggling in train AC duct : రైలు ప్రయాణంలో ఏసీ ఆగిపోతే చిరాకు పడతాం, సిబ్బందికి ఫిర్యాదు చేస్తాం. కాసేపటికి సమస్య పరిష్కారమవుతుంది. కానీ, లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ ఆగిపోతే, ప్రయాణికుల ఫిర్యాదుతో కదిలిన సిబ్బందికి దిమ్మతిరిగే నిజం బయటపడింది. అది చుసిన వారు ఒక్కసారిగా నివ్వెర పోయారు. ఎందుకంటే అక్కడ గాలికి బదులు ఏసీ పైపుల నుంచి మద్యం సీసాలు బయటపడితే ఎలా ఉంటుంది..? ఆ భారీ మద్యం దందా గుట్టు ఎలా రట్టయిందో తెలుసుకోవాలంటే ఈ పూర్తి కథనం చదవాల్సిందే.!
విస్తుపోయే వాస్తవం వెలుగులోకి : లక్నో నుంచి బరౌనీ వెళుతున్న లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ (15204) రైలులోని ఏసీ-2 టైర్ కోచ్‌లో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కోచ్‌లో ఏసీ సరిగా పనిచేయడం లేదని, చల్లగాలి రావడం లేదని కొందరు ప్రయాణికులు రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టెక్నికల్ సిబ్బంది, ఏసీ డక్టును తెరిచి చూశారు. అదితెరిచి చూడగానే అసలు విషయం బయటపడింది. కోచ్‌లోని 32, 34 నంబర్ల బెర్తుల పైన ఉన్న ఏసీ డక్టును తెరిచి చూడగా, లోపల వార్తాపత్రికల్లో చుట్టిన వందల కొద్దీ విస్కీ బాటిళ్లు గాలి ప్రవాహానికి అడ్డుగా ఉండటాన్ని గుర్తించారు. దీంతో అధికారులు ప్రయాణికులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.
వెంటనే అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఆ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, కోచ్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 150కి పైగా మద్యం సీసాలు లభించినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో వీడియో వైరల్ : ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో వైరల్‌గా మారింది. నిషేధం ఉన్నందువల్లేనా..?
ఈ ఘటనకు ప్రధాన కారణం బిహార్ రాష్ట్రంలో అమల్లో ఉన్న సంపూర్ణ మద్యపాన నిషేధమే అని భావిస్తున్నారు. 2016 నుంచి అక్కడ మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధించబడ్డాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి రైళ్లు, ఇతర వాహనాల ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు.
స్మగ్లర్లు ఎవరికీ అనుమానం రాకుండా ఏసీ డక్టుల వంటి చోట్ల మద్యాన్ని దాచి తరలిస్తున్నారని తెలుస్తోంది. కొందరు రైల్వే యార్డులోనే సిబ్బంది సహకారంతో ఈ లోడ్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. “స్మగ్లర్లు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో చూడండి” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ ఇదే రైలులో ఇలాగే మద్యం పట్టుబడిన ఘటనలు ఉన్నట్లు సమాచారం.


