Homeనేషనల్Historic Takeoff: గగనంలో గర్వంగా.. స్వదేశీ 'సీ-295' విహారంగా: రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర!

Historic Takeoff: గగనంలో గర్వంగా.. స్వదేశీ ‘సీ-295’ విహారంగా: రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర!

Made in India C-295 aircraft : భారత రక్షణ రంగం మునుపెన్నడూ చూడని సువర్ణాధ్యాయానికి తెరలేచింది. దశాబ్దాలుగా కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే (హెచ్ఏఎల్‌ – HAL) పరిమితమైన సైనిక విమానాల తయారీలో.. తొలిసారిగా ప్రైవేటు రంగం తన సత్తా చాటింది. ‘మేకిన్‌ ఇండియా’లో (Make in India) భాగంగా, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి ‘ఎయిర్‌బస్‌ సీ-295’ (Airbus C-295) రవాణా విమానం గుజరాత్‌లోని వడోదర గగనతలంలో గర్వంగా విహరించింది. విడిభాగాలను అమర్చడం మాత్రమే కాకుండా, పూర్తిస్థాయిలో ఒక సైనిక విమానాన్ని ప్రైవేట్ సంస్థ తయారు చేసి విమాన ప్రయాణ పరీక్షల  దశకు తీసుకురావడం దేశ చరిత్రలోనే ప్రథమం. అంతేకాదు, ఎయిర్‌బస్ సంస్థ ఐరోపా వెలుపల ఒక పూర్తి స్థాయి సైనిక విమానాన్ని నిర్మించడం కూడా ఇదే తొలిసారి. 

- Advertisement -

టాటా – ఎయిర్‌బస్ ఒప్పందం.. స్వావలంబన దిశగా అడుగులు : దేశీయ రక్షణ రంగాన్ని స్వావలంబన (ఆత్మనిర్భర్ భారత్) దిశగా నడిపించేందుకు కేంద్ర రక్షణ శాఖ సెప్టెంబర్ 2021లో విమాన తయారీ దిగ్గజం ‘ఎయిర్‌బస్’ (Airbus) తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ. 21,935 కోట్ల వ్యయంతో మొత్తం 56 ‘సీ-295’ రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి డీల్ ఖరారైంది. ఈ ఒప్పందం ప్రకారం.. మొదటి 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లె ప్లాంట్ నుంచి నేరుగా ‘ఫ్లై-అవే’ (గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న) స్థితిలో భారత్‌కు అందిస్తారు. మిగిలిన 40 విమానాలను పూర్తి సాంకేతిక బదిలీ (Tech Transfer) ద్వారా టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) భాగస్వామ్యంతో వడోదరలో ఏర్పాటు చేసిన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. స్పెయిన్ నుంచి వచ్చిన మొదటి విమానం సెప్టెంబర్ 2023లోనే వాయుసేన అమ్ములపొదిలో చేరి సేవలందిస్తుండగా.. తాజాగా భారత్‌లో తయారైన తొలి విమానం అత్యంత విజయవంతంగా టెస్ట్ ఫ్లైట్ పూర్తి చేసుకుని తన సత్తాను నిరూపించుకుంది.

హిమాలయాలైనా.. మారుమూల ప్రాంతమైనా సై!  :  ఆరు దశాబ్దాలకు పైగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో (IAF) సేవలు అందిస్తూ కాలం చెల్లిన ‘ఆవ్రో హెచ్ఎస్-748’ (Avro HS-748) విమానాల స్థానాన్ని ఈ అత్యాధునిక సీ-295 విమానాలు భర్తీ చేయనున్నాయి.
భారీ సామర్థ్యం: ఈ విమానం ఒకేసారి 71 మంది సైనికులను లేదా 50 మంది పారాట్రూపర్లను మోసుకెళ్లగలదు. దాదాపు 9 టన్నుల బరువైన భారీ యుద్ధ సామగ్రిని లేదా కార్గోను రవాణా చేస్తుంది.

చిన్న రన్‌వేల నుంచి టేకాఫ్: అత్యంత ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాలు, మంచు కొండలు, తీర ప్రాంతాలు, ఎడారుల్లో సైతం ఇది సునాయాసంగా గగనవిహారం చేయగలదు. దీనికి ఉన్న షార్ట్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (STOL) ఫీచర్ వల్ల కేవలం 2,200 అడుగుల (చాలా చిన్న) రన్‌వే నుంచి కూడా సులభంగా ఎగరగలదు.

బహుముఖ సేవలు: సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతాలకు వేగంగా బలగాలను తరలించడానికి, విపత్తు నిర్వహణలో వేగంగా స్పందించడానికి, మెడికల్ ఎవాక్యుయేషన్ (వైద్య సహాయం) కార్యకలాపాలకు ఈ విమానం బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది.

దేశీయ పరిశ్రమలకు ఊపిరి.. లక్షలాది ఉపాధి అవకాశాలు : ఈ మెగా ప్రాజెక్ట్ కేవలం రక్షణ రంగానికే పరిమితం కాలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్‌లా పనిచేస్తోంది. ఈ ‘సీ-295’ విమాన నిర్మాణానికి కావాల్సిన వేలాది విడిభాగాలను కేవలం గుజరాత్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న డజన్ల కొద్దీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) నుంచి సేకరిస్తున్నారు. దీనివల్ల దేశంలో అత్యంత శక్తివంతమైన ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్‌వర్క్ (ఎకోసిస్టమ్) తయారవుతోంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏరోస్పేస్ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తద్వారా రక్షణ సామగ్రి తయారీలో ప్రపంచ చిత్రపటంపై భారత్ ఒక తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News